Site icon NTV Telugu

Ponguleti Srinivas Reddy : ఇందిరమ్మ ప్రభుత్వంలో భూ హక్కుల కోసం చారిత్రాత్మక అడుగులు

Ponguleti

Ponguleti

Ponguleti Srinivas Reddy : రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో మాట్లాడుతూ, ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి అంకితమై పనిచేస్తోందని పేర్కొన్నారు. ప్రగతి భవన్‌ను జ్యోతి రావు ఫూలే భవనంగా మార్చిన ఘనత కూడా ఈ ప్రభుత్వానిదేనని అన్నారు. ఇది ప్రజలకు గౌరవం ఇచ్చే ముఖ్యమైన చిహ్నంగా నిలుస్తుందన్నారు.

గత ప్రభుత్వ హయాంలో ధరణిలో చోటుచేసుకున్న అవకతవకలన్నీ సరి చేయడం కోసం కొత్త భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామని తెలిపారు. ఈ చట్టాన్ని తీసుకురావడమే కాకుండా, మూడు నెలలు కూడా పూర్తవకముందే దానికి సంబంధించిన విధానాలు రూపొందించడంలో ప్రభుత్వం చూపిన వేగాన్ని మంత్రి వివరించారు. అంబేడ్కర్ జయంతి రోజున శిల్పారామంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా భూభారతి చట్టాన్ని ప్రజలకు అంకితం చేయనున్నట్లు వెల్లడించారు.

పేదవారు సంపాదించిన భూమిపై సంపూర్ణ హక్కులు కల్పించేలా ఈ చట్టాన్ని రూపొందించామని, ఇది చరిత్రలో నిలిచిపోతుందని ఆయన చెప్పారు. గత పదేళ్లలో అనేక భూసంబంధిత ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజల అవసరాల్ని దృష్టిలో పెట్టుకొని ఈ చట్టం రూపొందించబడిందని పేర్కొన్నారు. ఒక్క గజం భూమికి కూడా భద్రత కల్పించేలా భూభారతిలో ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు.

గత ప్రభుత్వ హయాంలో 8.19 లక్షల కోట్లు అప్పు చేసి, నాయకులు ఫామ్ హౌస్‌లలో విశ్రాంతి తీసుకున్నారని విమర్శించారు. మరోవైపు, కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ఆర్థిక ఒత్తిళ్ల మధ్య ఉన్నప్పటికీ, ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారని కొనియాడారు.

కాలేశ్వరం ప్రాజెక్టుపై కూడా మంత్రి స్పందించారు. గత ప్రభుత్వంలోనే ప్రాజెక్టు వాస్తవానికి కూలిపోయిందని తెలిపారు. కానీ అయినా Telangana రైతులు వర్షాకాలంలో దేశంలో ఎక్కడా లేని విధంగా అధికంగా ధాన్యం ఉత్పత్తి చేయగలిగారని గర్వంగా వెల్లడించారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కారణంగా కొన్ని హామీల అమలు ఆలస్యం అవుతున్నా, ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ ప్రతి హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. కేంద్రం, ప్రతిపక్షాల కుట్రలన్నీ కూడా నిజాయితీతో ఎదుర్కొంటూ, ప్రభుత్వం పేదలకు న్యాయం చేస్తుందని అన్నారు.

గిరిజన ప్రాంతాల్లో సాగులో ఉన్న సీతారామ కాలువ పనులు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు. పోడు భూముల సమస్యను కూడా ఈ ప్రభుత్వం లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పులుసు బొంత ప్రాజెక్ట్‌కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి కుమార్ రెడ్డి త్వరలో శంకుస్థాపన చేయనున్నారని వెల్లడించారు.

Tariffs War: ట్రంప్ ఎఫెక్ట్.. ఇండియా తర్వాత, ఈయూ సాయం కోరిన చైనా..

Exit mobile version