Police: ఉమ్మడి కర్నూలు జిల్లాలో కొందరు పోలీసులు డిపార్ట్‌మెంట్‌కే తలవంపులు తెచ్చేలా వ్యవహరిస్తున్నారు. దొంగలు, కిరాయి హంతకులతో కుమ్మక్కై నేరాలకు పాల్పడుతున్నారు. మట్కా, పేకాట క్లబ్బుల నిర్వాహకులకు సలాం కొట్టే వాళ్ళు ఉన్నారు. నేరస్తులను మించి అక్రమాలు, అరాచకాలకు పాల్పడుతూ పోలీస్ శాఖ పరువుతీస్తున్నారు. ఎన్నోసార్లు, ఎంతో మంది సస్పెండ్ అవుతున్నా డిపార్ట్‌మెంట్‌లో కొందరి తీరు మారడం లేదు. పోలీసులే దొంగలుగా మారుతున్నారు. కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్‌లో 80 లక్షలు విలువ చేసే 105 కిలోల వెండి, 2 లక్షల 5 వేలు నగదు మాయం చేసిన కేసులో ASI సస్పెండ్ కాగా ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, ఒక కానిస్టేబుల్ జైలుకు వెళ్లారు.
తాజాగా ఆస్పరి పీఎస్‌లో కానిస్టేబుల్ విజయకుమార్ దొంగ నోట్ల కేసులో ఇరుక్కున్నాడు. ఒక అసలు నోటుకు.. 3 దొంగ నోట్లు ఇస్తానని చెప్పి 30 లక్షలు వసూలు చేశాడు. అది కూడా అధికారంలో ఉన్న పార్టీ నాయకులతో. నకిలీ నోట్లు ఇవ్వకపోవడంతో ఆ నేతలు కానిస్టేబుల్‌ను కిడ్నాప్ చేసేందుకు స్కెచ్ వేశారు. అది కాస్తా ఫెయిల్ కావడంతో వ్యవహారం బయటికి వచ్చింది. దీంతో విజయకుమార్‌ను సస్పెండ్ చేసి కేసు నమోదు చేశారు. కర్నూలు తాలూకా సిఐగా పని చేసిన కంబగిరిరాముడు అప్పటి ఎస్పీ పేరు చెప్పి 15 లక్షలు తీసుకోవడంతో సస్పెండ్ చేశారు.
నంద్యాల జిల్లా డోన్‌లో సెల్ ఫోన్ చోరీల కేస్‌లో ఓ పోలీస్ అధికారి చేతి వాటం ప్రదర్శించారు. దొంగల ముఠా చెన్నై నుంచి సెల్‌ఫోన్‌లు చోరి చేసుకుని కారులో వస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అయితే దొంగలపై కేసులు పెట్టకుండా ఓ మధ్యవర్తి ద్వారా ఓ పోలీస్ అధికారి లక్షల్లో వసూలు చేసాడు. విషయం బయటికి పొక్కడంతో అంతర్గత విచారణకు ఆదేశించారు అధికారులు. డబ్బులు ముట్టచెప్పిన దొంగలను కూడా విచారించి ఆరోపణలను నిర్ధారించుకున్నారు. నేడో రేపో ఆ అధికారిపై వేటు పడే అవకాశం ఉందని డిపార్ట్‌మెంట్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో రెండేళ్ల వ్యవధిలో కానిస్టేబుల్ స్థాయి నుంచి సిఐ స్థాయి వరకు కనీసం 30 మంది అవినీతి, అక్రమాలు, దొంగలతో, పేకాట, మట్కా నిర్వాహకులతో దోస్తీ వంటి వ్యవహారాల్లో సస్పెండ్ అయ్యారు. సస్పెండ్ అయినవారిలో 10 మంది వరకు సిఐ స్థాయి అధికారులున్నారు. ఇక ఆరోపణలతో విఆర్‌కి పంపినవాళ్ళు, బదిలీ అయినవాళ్ళు అనేకమంది. హోళగుంద పీఎస్‌లో కర్ణాటక మద్యం బాక్సులను అధికార పార్టీ నాయకులకు అప్పచెప్పి సొమ్ము చేసుకున్న వ్యవహారంలో ఇద్దరు కానిస్టేబుళ్లను విఆర్‌కు పంపారు. మరికొందరు కీలకమైన వ్యక్తులు తప్పించుకున్నారు. సి.బెళగల్ ఎస్ ఐ శివాంజల్ 50 వేలు తీసుకుంటూ ఎసిబికి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఆస్పరిలో మద్యం వ్యవహారంలో ఎస్సై గిరిబాబును సస్పెండ్ చేశారు.
దొంగలు, పేకాట, మట్కా నిర్వాహకులతో పోలీసులు చెటాపట్టాల్ వేసుకొని తిరగడం కామన్ అయింది. నంద్యాలలో మట్కా డాన్ కుమార్తె సెల్ నెంబర్ ను పోలీస్ వాట్స్అప్ గ్రూపులో చేర్చి సమాచారాన్ని ఎప్పటికపుడు లీక్ చేసిన వ్యవహారం గతంలో బయటపడింది. ఎమ్మిగనూరులో దొంగలతో చెట్టాపట్టాలేసుకుని జల్సాలు చేసిన పోలీసులపై చర్యలు తీసుకున్నారు. కోసిగిలో కర్ణాటక అక్రమ మద్యం వ్యాపారులకు పోలీస్ దాడుల సమాచారం ఇస్తూ ఇద్దరు కానిస్టేబుళ్లు పట్టుబడ్డారు. నంద్యాలలో అక్రమ రిజిస్ట్రేషన్లు చేసి స్థలాలను కబ్జా చేసే గ్యాంగ్ లకు సహకరించి వన్ టౌన్ ఓ ఏఎస్‌ఐ, ముగ్గురు కానిస్టేబుల్లు సస్పెండ్ అయ్యారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పోలీస్ శాఖలో సిబ్బంది ఫేస్ చేస్తున్నన్ని ఆరోపణలు మరే జిల్లాలోనూ ఉండవేమో. ఉన్నతాధికారుల పర్యవేక్షణా లోపం, రాజకీయ జోక్యం అందుకు కారణమనే మాటలు వినిపిస్తున్నాయి.