సిర్పూర్‌లో నేతల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు కొనసాగుతున్నాయి. తుమ్మడి హట్టి ప్రాజెక్టుపై బహిరంగ చర్చకు రావాలంటూ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు మంగళవారం సవాల్ విసిరారు. ఎమ్మెల్యే సవాల్‌ను కోనప్ప స్వీకరించారు. ఈరోజు ఉదయం 11 గంటలకు తుమ్మడి హట్టి వద్ద బహిరంగ చర్చకు ఇద్దరు నేతలు, వారి అనుచరులు సిద్దమయ్యారు. అయితే కాగజ్ నగర్‌లో ఎమ్మెల్యే హరీష్ బాబును తుమ్మడి హట్టి వద్దకు వెళ్లకుండా ఆయన ఇంటి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. మరోవైవు కోనప్ప, ఆయన అనుచరులు కూడా అడ్డుకున్నారు.
Also Read: BCCI: అప్పుడు తొలగించింది.. ఇప్పుడు మరలా అపాయింట్ చేసుకుంది!
నీళ్లు సిద్దిపేటకు తరలిపోతుంటే కోనేరు కోనప్ప చూస్తూ ఊరుకున్నారని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు ఆరోపణలు చేశారు. కోనప్ప వల్లే సిర్పూర్‌కు అన్యాయం జరిగిందన్నారు. తుమ్మిడి హట్టి నుంచి ప్రాజెక్టును కాళేశ్వరానికి తరలించినా కోనప్ప మాట్లాడలేదన్నారు. తుమ్మిడి హెట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ కట్టవద్దని గతంలో ఎమ్మెల్యే హరీష్ కుటుంబ సభ్యులు (తల్లి) ధర్నాలు చేశారని కోనప్ప ఆరోపించారు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. దీనిపై బహిరంగ చర్చకు వెళ్లేందుకు మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్యే సిద్ధమయ్యారు. బహిరంగ చర్చకు వెళ్లకుండా ఇద్దరినీ పోలీసులు అడ్డుకున్నారు. ప్రస్తుతం కోనప్ప ఇంటి వద్ద పోలీసులు మోహరించారు.