Raja Singh : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు మంగళ్ హాట్ పోలీసులు మంగళవారం మరోసారి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తెలంగాణ హైకోర్టు నిబంధనలను ఉల్లంఘించారని పోలీసులు ఆ నోటీసులో పేర్కొన్నారు. ఈ నెల 29న ముంబైలో జరిగిన కార్యక్రమంలో ఓ వర్గాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు నోటీసులిచ్చారు. ఈ విషయమై రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆ నోటీసులో పోలీసులు పేర్కొన్నారు.
Read Also: Union Budget : నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు.. పార్లమెంట్లో ప్రసంగించనున్న రాష్ట్రపతి
గత ఏడాది ఆగస్టులో సోషల్ మీడియాలో వివాదాస్పద వీడియోను అప్ లోడ్ చేశారని రాజా సింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో ఇదే తరహ కేసులు రాజాసింగ్ పై నమోదు కావడంతో రాజాసింగ్ పై పోలీసులు పీడీయాక్ట్ ను నమోదు చేశారు. పీడీ యాక్ట్ కింద పోలీసులు గత ఏడాది ఆగస్టు 25న అరెస్ట్ చేశారు. ఈ కేసులో రాజాసింగ్‌కు తెలంగాణ హైకోర్టు 2022 నవంబర్ 9న షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇకపై రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయవద్దని కూడా కోర్టు సున్నితంగా ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను రాజాసింగ్ ఉల్లంఘించి ముంబైలో జరిగిన కార్యక్రమంలో ఓ వర్గాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని పోలీసులు తాజాగా నోటీసులు జారీ చేశారు.
Read Also: Pathan Effect: వెనక్కి వెళ్లిన అల వైకుంఠపురం లో రీమేక్
ఇక, పోలీసుల నోటీసులపై రాజాసింగ్ స్పందించారు. రాజాసింగ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘నిజాం పాలనకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారు. పోలీసులు నోటీసులు ఇచ్చినా, జైలుకు పంపినా భయపడేది లేదు. ధర్మం కోసం చావడానికైనా సిద్ధంగా ఉన్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను.. గో హత్య, మతమార్పిడులు, లవ్ జిహాద్‌పై చట్టం చేయాలని కోరాను.. ఇందులో మత విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏం ఉన్నాయి. ముంబైలో పాల్గొన్న కార్యక్రమంలో మాట్లాడితే.. నాకు తెలంగాణ పోలీసులు నోటీసులు ఇచ్చారు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.