Stone Attack on CM Jagan: సీఎం జగన్‌పై దాడి ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. స్కూల్ బిల్డింగ్ పైనుంచే జగన్‌పై దాడి జరిగిందని ప్రాథమిక అంచనా వేస్తున్నారు. ఘటనాప్రాంతం సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. స్కూల్ భవనంలో అడుగడుగునా సీసీ కెమెరాలు ఉండగా.. స్కూల్ బిల్డింగ్‌ను సీపీ కాంతి రాణా పరిశీలించారు. ఘటనా స్థలాన్ని క్లూస్ టీం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఘటనా స్థలంలో సీసీఫుటేజ్‌ను కూడా పరిశీలిస్తున్నారు. పలువురు అనుమానితులను పోలీసులు విచారిస్తున్నారు. వివేకానంద స్కూల్‌కు, గంగానమ్మ గుడికి మధ్యలోని చెట్ల దగ్గర నుంచి దాడి జరిపినట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. సీఎం జగన్‌పై పక్కా స్కెచ్ వేసుకుని దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. వివేకానంద స్కూల్‌కు, గంగానమ్మ గుడికి మధ్య ఉన్న చెట్లు దగ్గర నుంచి దాడి జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అక్కడ పూర్తిగా చీకటిగా ఉండడం.. చెట్లు ఉండడంతో నిందితుడు కనిపించలేదు. దాడికి పాల్పడి.. అక్కడి నుంచి ఈజీగా ఎస్కేప్ కావచ్చని ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. 30 అడుగుల దూరం నుంచి బలంగా రాయిని విసిరినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ షెడ్యూల్ ప్రకారం శనివారం రాత్రి విజయవాడ చేరుకుంటారని ముందే తెలుసుకున్న ఆగంతకుడు ఇందుకు తగ్గట్టే ముందస్తు కుట్ర, ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బస్సు యాత్ర విజయవాడలోకి శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రవేశించింది. బస్సు యాత్ర సాగే మార్గంలో విద్యుత్ సరఫరాను నిలిపేస్తుండటాన్ని ఆగంతకుడు ఆసరాగా చేసుకున్నాడు.
Read Also: Vijayasai Reddy: ముఖ్యమంత్రి జగన్‌పై జరిగిన దాడి హేయమైన చర్య
జగన్‌పై దాడి ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు.. సీఎం జగన్, వేలంపల్లి ఇద్దరికీ తగిలిన రాయి ఒకటేనా లేక వేర్వేరా అనే విషయంపై అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే విచారణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. జగన్‌పై దాడి కేసును డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి నిరంతరం పరివేక్షిస్తున్నారు. ఈ ఘటనపై ఈసీకి సీపీ కాంతి రాణా నేడు నివేదిక ఇవ్వనున్నారు. ఏ సమయంలో, ఎక్కడ ఎలా జగన్ పై దాడి జరిగిందని సవివరంగా నివేదిక ఇవ్వనున్నారు. దాడికి పాల్పడిన వారి ఆచూకీ ఇప్పటి వరకు గుర్తించలేదని సమాచారం. సీఎం జగన్‌పై దాడి చేసిన ప్రాంతంలో పోలీసులు డ్రోన్ విజువల్స్ తీయిస్తున్నారు. ఏరియల్ వ్యూ ద్వారా దాడి ప్రాంతాన్ని ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని కోణాల్లో విశ్లేషిస్తున్నారు పోలీసుల విజువల్ అనాలసిస్ మీద ఫోకస్ పెట్టారు. ఈ విచారణలో పోలీసులకు ఇబ్బందులు ఏర్పడ్డాయని తెలుస్తోంది. బస్సు యాత్ర రూట్‌లో సీసీటీవి ఫుటేజ్ సేకరణ సవాలుగా మారినట్టు పోలీసులు చెబుతున్నారు. జగన్ బస్సు యాత్ర నేపథ్యంలో ఆ రూట్‌లో రోడ్డుకు ఇరు వైపులా కలిపే వైర్లను ముందే అధికారులు కట్ చేశారు. సీసీటీవీ వైర్లు, కేబుల్ వైర్లు, విద్యుత్ వైర్లు కట్ చేయటంతో సీసీటీవీ ఫుటేజ్ ఇబ్బందిగా మారింది. నెట్, విద్యుత్ సరఫరా ఉంటేనే డీవీఆర్ ఆన్‌లో ఉండి సీసీటీవీ ఫుటేజ్ రికార్డ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. విద్యుత్ సరఫరా లేకపోవటం, వైర్లు కట్ అవటంతో సీసీటీవీ ఫుటేజ్ కష్టంగా మారింది. సామాజిక మాధ్యమాల్లో అందుబాటులో ఉన్న వీడియోల ద్వారా ఆధారాలు సేకరించే ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు. విద్యుత్, నెట్, సీసీటీవీ కెమెరాల వైర్‌లను ఉదయం నుంచి ఆయా విభాగాల సిబ్బంది పునరుద్ధరణ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. సీఎం జగన్‌పై దాడిని ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకుంది. విజయవాడ సీపీ కాంతి రాణాను సీఈఓ ఎంకే మీనా నివేదిక కోరారు. సీపీ కాంతి రాణా నుంచి ప్రాథమిక సమాచారాన్ని సీఈవో తీసుకున్నారు. . ఏపీలో జీరో వయలెన్స్ ఎన్నికలే టార్గెట్‌గా పెట్టుకున్న ఈసీ.. ఏకంగా సీఎంపైనే దాడి జరగడంతో ఈసీ సీరియస్‌గా రియాక్ట్ అయింది. ఈ క్రమంలోనే నేడు సీపీ కాంతి రాణా ఎన్నికల సంఘానికి నివేదికను సమర్పించనున్నారు.