POCSO Case Filed on Indian Hockey Player Varun Kumar: భారత హాకీ ప్లేయర్, అర్జున అవార్డు గ్రహీత వరుణ్ కుమార్‌పై పోక్సో కేసు నమోదైంది. వరుణ్ కుమార్ తనపై గత ఐదేళ్లుగా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెంగళూరు పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. పెళ్లి పేరుతో గత ఐదేళ్లుగా తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని సదరు యువతి ఫిర్యాదులో పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే..
కర్ణాటకకు చెందిన 22 ఏళ్ల యువతికి 2019లో ఇన్‌స్టాగ్రామ్‌లో వరుణ్ కుమార్ పరిచయం అయ్యాడు. అప్పుడు ఆమె వయసు 17 ఏళ్లు. బెంగళూరులో హాకీ మ్యాచ్‌ల కోసం వచ్చినప్పుడు వరుణ్ తనను కలిసేవాడని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో శృంగారంలో పాల్గొనేవాడని బాధితురాలు ఫిర్యాదులో తెలిపింది. గత ఐదేళ్లుగా వరుణ్ తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపించింది. ప్రస్తుతం తన వయసు 22 ఏళ్లు అని, పెళ్లి ప్రస్తావన తీసుకువస్తే తనకు అలాంటి ఉద్దేశం లేదంటున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
Also Read: OnePlus 12R Launch: నేడు మార్కెట్‌లోకి వన్‌ప్లస్ 12ఆర్ స్మార్ట్‌ఫోన్.. 6 బ్యాంక్ ఆఫర్‌లు ఇవే!
యువతి ఫిర్యాదు మేరకు బెంగళూరులోని జ్ఞాన భారతి పోలీసులు వరుణ్ కుమార్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన వరుణ్ కుమార్.. పంజాబ్‌లోని జలంధర్‌లో నివాసం ఉంటున్నాడు. అతడిని విచారించేందుకు కర్ణాటక పోలీసులు జలంధర్ వెళ్లారు. అయితే ప్రస్తుతం వరుణ్ పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు. ప్రస్తుతం వరుణ్ భారత జాతీయ జట్టులో ఆడుతున్నాడు. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన భారత హాకీ జట్టులో సభ్యుడు కూడా. హాకీ ఇండియా లీగ్‌లో పంజాబ్ వారియర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.