Rivaba Jadeja: భారతీయులు ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రపంచకప్‌ని ఆస్ట్రేలియా ఎగరేసుకుపోయింది. దీంతో భారత ఆటగాళ్లే కాదు యావత్ దేశం కూడా బాధపడింది. ఇండియా ఓటమి అనంతరం భారత ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా భారత జట్టు డ్రెస్సింగ్ రూంకి వెళ్లి భారత ఆటగాళ్లను ఓదార్చారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ప్రతిపక్షాలు దీనిని పబ్లిసిటీ స్టంట్‌గా విమర్శిస్తున్నాయి, అయితే ప్రధాని డ్రెస్సింగ్ రూం సందర్శనపై క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా స్పందించారు.
అహ్మదాబాద్‌లో జరిగిన ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో ఘోర పరాజయం పాలైన ఆటగాళ్లను ఓదార్చడానికి మరియు మనోధైర్యాన్ని పెంచడానికి టీమ్ ఇండియా డ్రెస్సింగ్ రూమ్‌ను సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీని బీజేపీ ఎమ్మెల్యే, క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా ప్రశంసించారు. గుజరాత్ జామ్‌నగర్ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరుపున ఆమె ఎమ్మెల్యేగా ఉన్నారు. రివాబా జడేజా ఓ ట్వీట్‌లో.. ప్రధాని నరేంద్రమోడీ డ్రెస్సింగ్ రూంకు వెళ్లడం అతని దయగల రాజనీతిజ్ఞతను ప్రతిబింబిస్తుందని అన్నారు. డ్రెస్సింగ్ రూంలో భారత ఆటగాళ్లలో ప్రధాని మోడీ మాట్లాడుతున్న వీడియోను ఆమె షేర్ చేశారు.
Read Also: Tamil Nadu: గొడ్డు మాంసం తిన్న విద్యార్థిని వేధించి, దాడి చేసిన ఉపాధ్యాయులు..
‘‘ ప్రధాని నరేంద్రమోడీ తిరుగులేని నాయకత్వం గెలుపు, ఓటమి క్షణాల్లో కూడా ప్రకాశిస్తుంది. ప్రపంచకప్ ఓటమి తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లి ఆటగాళ్లను పరామర్శించడం ఆయన కరుణతో కూడిన రాజనీతిజ్ఞతను ప్రతిబింబిస్తుంది, ప్రోత్సాహం, ఐక్యత స్ఫూర్తిని పెంచుతుంది’’ అంటూ మంగళవారం ఆమె ట్వీట్ చేశారు.
నవంబర్ 19న అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియా, ఇండియాల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో భారత్ కేవలం 240 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ట్రావిస్ హెడ్, లుబుషంగేలు ఆస్ట్రేలియాకు చిరస్మరణీయ విజయాన్ని అదించారు. భారత్ ఓటమి 140 కోట్ల ప్రజల్ని విషాదంలోకి నెట్టింది.