Narendra Modi: ప్రజాకవి గద్దర్ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. కాగా గద్దర్ మృతిపట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసి తానెంతో బాధపడ్డానని ఆయన భార్య విమలకు మోడీ లేఖ రాశారు. తీవ్ర దు:ఖంలో ఉన్న గద్దర్ కుటుంబానికి మోడీ సానుభూతిని తెలియజేశారు. గద్దర్ పాటలు, ఇతివృత్తాలు సమాజంలోని బడుగు బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రతిబింబిస్తాయని మోడీ లేఖలో తెలిపారు. తెలంగాణ సాంప్రదాయక కళారూపాన్ని పునరుజ్జీవింపజేయడంలో ఆయన చేసిన కృషి ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని మోదీ కొనియాడారు. గద్దరు కుటుంబ సభ్యుల దు:ఖాన్ని మాటల్లో చెప్పలేనని, ఆయన కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు, బంధువులకు దీనిని తట్టుకునే శక్తిని ప్రసాదించమని కోరకుంటున్నానని మోదీ తెలిపారు. చివరిగా లేఖలో ఓంశాంతి అని పేర్కొన్నారు.
ప్రజా గాయకుడు గద్దర్ అనారోగ్యంతో మృతి చెందారనే విషయాన్ని బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి తాజాగా మోదీ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో మోదీ గద్దర్ భార్య విమలకు లేఖ రాశారు. కాగా ప్రముఖ విప్లవకారుడు, ప్రజాకవి గద్దర్ ఆగస్టు 6 వ తేదీన అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. తన మాటనే పాటగా మలచి ఎంతో మందిలో స్ఫూర్తి నింపిన ప్రజా యుద్ద నౌక గద్దరు ఆపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ లోకాన్ని విడిచి వెళ్లిన సంగతి తెలిసిందే. మొదట ఆయన ఆరోగ్యం బాగానే ఉందని చెప్పిన వైద్యులు రెండు రోజుల్లో ఆయన మరణించాడని వెల్లడించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా గద్దర్ కీలకపాత్ర పోషించారు. గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. ప్రజా కవిగా, ప్రజా యుద్ద నౌకగా గద్దర్ కు పేరుంది. ఇక గద్దర్ మరణ వార్త రెండు రాష్ట్రాల ప్రజలను షాక్ కు గురిచేసింది. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సానుభూతిని తెలియజేసిన సంగతి తెలిసిందే. తాజాగా మోదీ కూడా ఆయన కుటుంబానికి సానుభూతిని తెలియజేశారు. ఆయన అంతిమ యాత్రను చూసేందుకు కూడా జనాలు భారీగా తరలివచ్చి గద్దర్ పై తమకున్న గౌరవాన్ని, ప్రేమను చాటుకున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో గద్దర్ అంతిమ సంస్కారాలు జరిగిన విషయం విదితమే.