ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. అమరావతి ఒక నగరం కాదని, ఒక శక్తి అని పేర్కొన్నారు. వికసిత్ భారత్‌కు ఏపీ గ్రోత్ ఇంజిన్‌గా ఎదగాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్‌ను ఆధునాతన ప్రదేశ్‌గా మార్చే శక్తి అమరావతికి ఉందని, ఏపీలోని ప్రతి ఒక్కరి కలలను అమరావతి సాకారం చేస్తుందన్నారు. తాను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు టెక్నాలజీ వాడకాన్ని గమనించానని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు. అమరావతి పునఃనిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ప్రధాని మాట్లాడారు. ప్రధాని తన ప్రసంగాన్ని తెలుగులో మొదలు పెట్టారు. మధ్యమధ్యలో తెలుగులో మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకున్నారు.
‘అమరావతి స్వప్నం సాకారం అవుతున్నట్లు కనిపిస్తోంది. చారిత్రక పరంపర, ప్రగతి రెండు కలిసి పయనిస్తున్నట్లు కనిపిస్తుంది. ఒక కొత్త అమరావతి, కొత్త ఆంధ్రప్రదేశ్, బౌద్ధ వారసత్వం, ప్రగతి కలగలిసిన ప్రాంతం ఇది. అమరావతి ఒక నగరం కాదు, అమరావతి ఒక శక్తి. ఆంధ్రప్రదేశ్‌ను ఆధునాతన ప్రదేశ్‌గా మార్చే శక్తి అమరావతికి ఉంది. ఏపీలోని ప్రతి ఒక్కరి కలలను అమరావతి సాకారం చేస్తుంది. ఏఐ, టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, విద్యా రంగాల్లో అమరావతి ముందు ఉంటుంది. ఇవి కేవలం శంకుస్థాపనలు కాదు ఏపీ ప్రగతికి, వికసిత్ భారత్‌కు నిదర్శనం. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఇది శుభసంకేతం. రికార్డు స్పీడ్‌లో పనులు పూర్తి చేయడానికి కేంద్రం సహకరిస్తుంది. అమరావతిలో మౌలిక సదుపాయల కోసం కేంద్రం సహకరించింది. అమరావతికి ఉన్న ఆటంకాలు తొలగిపోయి ఇప్పుడు పనులు వేగంగా జరుగుతున్నాయి. చంద్రబాబు నాకు టెక్నాలజీ వాడకం గురించి చెప్పారు. నేను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఏపీ సీఎంగా చంద్రబాబు టెక్నాలజీ వాడకాన్ని గమనించాను’ అని ప్రధాని మోడీ చెప్పారు.
Also Read: Pakistan: పాకిస్తాన్‌కి విదేశీ విమాన సంస్థల షాక్.. ప్రతీ నెలా మిలియన్ డాలర్ల నష్టం..
‘అమరావతిని వికసిత్ భారత్ గ్రోత్ ఇంజిన్‌గా మార్చాలి. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ముందుంది. రోడ్ల నిర్మాణం వల్ల రైతులు, ఉద్యోగులు, సామాన్యులకు ప్రయోజనం కలుగుతుంది. హైవేల నిర్మాణం వల్ల టూరిజం అభివృద్ధి చెందుతుంది. రేణిగుంట-నాయుడిపేట హైవే వల్ల తిరుపతికి వేగంగా చేరుకోవచ్చు. 2009-14 వరకు ఉమ్మడి ఏపీకి రూ.900 కోట్ల కంటే తక్కువ బడ్జెట్ ఉండేది, ఇప్పుడు ఒక్క ఏపీ రైల్వే బడ్జెట్ రూ.9 వేల కోట్లపైనే ఉంది. రైల్వే బడ్జెట్ పెరగడం వల్ల వంద శాతం ఎలక్ట్రిఫికేషన్ పూర్తైంది. గత పదేళ్లలో 750కి పైగా ఫ్లైఓవర్ బ్రిడ్జిలు, అండర్ పాస్‌లు నిర్మించాం. అమృత్ భారత్ కింద చాలా రైల్వే స్టేషన్లను ఆధునీకరించాం. మౌలిక సదుపాయాల కల్పన వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. సాగు నీరుకు ఇబ్బంది లేకుండా నదుల అనుసంధానం చేస్తున్నాం. ప్రతి పొలానికి నీరు అందించాలి, రైతులకు ఎలాంటి సమస్య ఉండకూడదనేది మా లక్ష్యం. పోలవరాన్ని వేగంగా పూర్తి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేస్తాయి. శ్రీహరికోట నుంచి జరిగే ప్రయోగాలు దేశం మొత్తాన్ని గర్వపడేలా చేస్తాయి. మన ఆయుధాలే కాదు ఐకమత్యమే మన బలం’ అని ప్రధాని చెప్పుకొచ్చారు.