Site icon NTV Telugu

PM Modi: ఉగ్రవాదంపై ప్రపంచానికి ఐక్య సందేశం పంపించారు.. ప్రతిపక్షాలను ప్రశంసించిన మోడీ

Modi2

Modi2

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం ఐక్యంగా ఉందన్న సందేశాన్ని ప్రపంచానికి తెలియజేయడంలో దౌత్య బృందాలు విజయం సాధించాయని ప్రధాని మోడీ అన్నారు. పాకిస్థాన్ ఉగ్రవాద వైఖరిని ప్రపంచ దేశాలకు తెలియజేసేందుకు అధికార-ప్రతిపక్షాలతో కూడిన ఏడు బృందాలను ఆయా దేశాలకు కేంద్రం పంపించింది. ఆపరేషన్ సిందూర్ గురించి ప్రపంచ అధినేతలకు వివరించారు. అయితే మంగళవారం ప్రధాని మోడీ తన నివాసంలో దౌత్య బృందాలకు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దౌత్య బృందాలతో ప్రత్యేకంగా చర్చించారు. దౌత్య బృందాలను ప్రత్యేకంగా మోడీ ప్రశంసించారు.

ఇది కూడా చదవండి: Rain Alert: ఏపీకి వారం పాటు భారీ వర్ష సూచన

దౌత్య బృందంలో ఇంత మంది ప్రతిపక్ష సభ్యులు ఉండడం గొప్ప విషయం అని.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం ఐక్యంగా ఉందని ప్రపంచానికి ఒక పెద్ద సందేశం పంపించినట్లు మోడీ పేర్కొ్న్నారు. భవిష్యత్‌లో ఇలాంటి పర్యటనలు మరిన్ని ఉండాలని అభిప్రాయపడ్డారు. దౌత్య బృందాలు.. 33 విదేశీ రాజధానులు, యూరోపియన్‌ యూనియన్‌ను సందర్శించారు. ఈ బృందంలో తాజా ఎంపీలతో పాటు మాజీ ఎంపీలు, మాజీ దౌత్యవేత్తలు కూడా ఉన్నారు.

‘‘వివిధ దేశాల్లో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించిన ప్రతినిధుల బృందాలను కలిశాను. శాంతి పట్ల భారతదేశం యొక్క నిబద్ధత, ఉగ్రవాద ముప్పును నిర్మూలించాల్సిన అవసరాన్ని వివరించారు. భారతదేశం యొక్క స్వరాన్ని ప్రపంచ దేశాలకు తీసుకెళ్లిన తీరు పట్ల మనమందరం గర్విస్తున్నాము.’’ అని మోడీ ఎక్స్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇప్పటికే ప్రతినిధులను కలిశారు. దౌత్య బృందాలను ప్రశంసించారు.

ఇది కూడా చదవండి: ACB Raids: ఇరిగేషన్ ఇంజనీర్ ఇంటిపై ఏసీబీ సోదాలు.. 12 ప్రాంతాల్లో ఒకేసారి దాడులు..!

ప్రధాని మోడీ దౌత్య బృందాలతో ఆహ్లాదకరంగా గడిపారని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అన్నారు. అందరితో గంట పాటు గడిపారని.. పచ్చిక బయళ్ల చుట్టూ నడిచి అందరితో మాట్లాడినట్లు చెప్పుకొచ్చారు. కృతజ్ఞతలు చెప్పేందుకు ప్రధాని దీన్ని అవకాశంగా భావించారన్నారు. కేవలం అనధికారికంగానే సమావేశం అయినట్లు చెప్పారు. అధికారిక సమావేశం మాత్రం కాదని తేల్చిచెప్పారు.

నాలుగు ప్రతినిధి బృందాలకు పాలక కూటమి ఎంపీలు నాయకత్వం వహించారు. వీరిలో ఇద్దరు బీజేపీ, ఒకరు జేడీయూ, ఒకరు శివసేన నుంచి ఉన్నారు. ముగ్గురు ప్రతిపక్ష ఎంపీలు, ఒక్కొక్కరు కాంగ్రెస్, డీఎంకే, ఎన్‌సీపీ(ఎస్పీ) నుంచి ఉన్నారు.

బీజేపీకి చెందిన రవిశంకర్ ప్రసాద్, బైజ్యంత్ పాండా, కాంగ్రెస్‌కు చెందిన శశి థరూర్, జేడీయూకి చెందిన సంజయ్ ఝా, శివసేనకు చెందిన శ్రీకాంత్ షిండే, డీఎంకేకు చెందిన కనిమొళి, ఎన్‌సీపీ (ఎస్పీ)కి చెందిన సుప్రియా సులే ప్రతినిధుల బృందాలకు నాయకత్వం వహించారు. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా సభ్యుడిగా ఉన్నారు. ఈ ప్రతినిధి బృందాల్లో ప్రముఖ మాజీ పార్లమెంటు సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రులు గులాం నబీ ఆజాద్, సల్మాన్ ఖుర్షీద్ ఉన్నారు.

ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఉగ్రవాదులు 26 మందిని చంపేశారు. అనంతరం మే 7న భారత్.. పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అంతేకాకుండా పాకిస్థాన్ వైమానిక స్థావరాలు దెబ్బతిన్నాయి. దీంతో పాకిస్థాన్ కాళ్లబేరానికి వచ్చి కాల్పుల విరమణ కోరడంతో భారత్ అంగీకరించింది.

 

Exit mobile version