Piyush Goyal: కేంద్రమంత్రి పీయూష్ గోయల్ లండన్ లో నిర్వహించిన ఫ్యూచర్ ఫ్రాంటియర్ ఫోరమ్ లో ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కృత్రిమ మేధస్సు (AI), భారత్ తీసుకుంటున్న విధానాలపై ఆయన అనేక కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా ఆయన ‘‘మానవ మెదడు ఎప్పటికీ ఏ రకమైన కృత్రిమ మేధస్సుకన్నా గొప్పగానే ఉంటుంది’’ అని స్పష్టం చేశారు. అలాగే భారత్ తప్పకుండా AIని స్వీకరిస్తుందని, పనితీరు మెరుగుపరిచేందుకు దీన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటుందని చెప్పుకొచ్చారు. ఇది ఉద్యోగాలు కోల్పోతారన్న పరిస్థితిని తీసుకరావడం మాకు ఆందోళనకరం కాదని ఆయన అన్నారు.
మన దేశంలో ఉన్న ప్రతిభను పరిగణనలోకి తీసుకుంటే.. డేటా రంగం, కొత్త అవకాశాలను డికోడ్ చేయడంలో ప్రపంచానికి భారత్ నుంచి సహాయపడే అవకాశాలు మరెన్నో ఉన్నాయి. అందుకే మన ప్రజలకు తిరిగి శిక్షణనివ్వడం, నైపుణ్యాలను అభివృద్ధి చేయాల్సిన నేపథ్యంలో AIని స్వీకరించాల్సిన అవసరం ఉందని ఆయన వివరించారు. మానవ మెదడే AIని సృష్టించింది. అందుకే దానిని నియంత్రించగలిగేది కూడా మనమే. దీనిపై నాకు పూర్తి నమ్మకం ఉందని గోయల్ పునరుద్ఘాటించారు.
Read Also: Exclusive : తమిళ హీరోలకు తెలుగు దర్శకులు అలా.. తెలుగు హీరోలకు తమిళ దర్శకులు ఇలా
బుధవారం నుండి ప్రారంభమైన రెండు రోజుల యూకే అధికారిక పర్యటనలో భాగంగా పీయూష్ గోయల్ భారత్-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA)పై కీలక సమావేశాల్లో పాల్గొన్నారు. గత వారాల్లో ఇద్దరు దేశాల ప్రధానమంత్రుల ద్వైపాక్షిక ప్రకటన అనంతరం, ఈ పర్యటన అత్యంత ప్రాధాన్యతకు దారితీసింది. అలాగే గురువారం యూకే ఛాన్సలర్ ఆఫ్ ది ఎక్సచేక్యూర్ రాచెల్ రీవ్స్‌తో కూడా మంత్రి సమావేశమై, ఆర్థిక వ్యవస్థల సహకారం, సస్టెయినబుల్ ఫైనాన్స్, వాణిజ్య అవకాశాలపై చర్చించారు. మంత్రి పర్యటన భారత-యూకే మధ్య బలమైన ఆర్థిక, వాణిజ్య బంధాలను మరింత దృఢపరచడాన్ని లక్ష్యంగా చేసుకుని కొనసాగుతోంది.