ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు అదనపు సాధారణ మధ్యంతర బెయిల్ ఇవ్వాలని నాలుగో సంవత్సరం లా విద్యార్థి గురువారం ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలు చేశాడు. జైల్లో కేజ్రీవాల్ భద్రతకు ముప్పు పొంచి ఉందని పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో తక్షణమే మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని న్యాయశాస్త్ర విద్యార్థి అభ్యర్థించాడు. ఇదిలా ఉంటే గురువారం వ్యక్తిగత డాక్టర్ సదుపాయం కల్పించాలని కోరుతూ కేజ్రీవాల్ పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఈడీ పలు ఆరోపణలు చేసింది. మెడికల్ బెయిల్ పొందేందుకు కేజ్రీవాల్ మామిడి పండ్లు, తీపి పదార్ధాలు తింటున్నారని ఆరోపించింది. ఈ సందర్భంగా కేజ్రీవాల్ డైట్ వివరాలు సమర్పించాలని తీహార్ జైలు అధికారులకు న్యాయస్థానం ఆదేశించింది.
ఇది కూాడా చదవండి: BrahMos: ఫిలిప్పీన్స్‌కి భారత బ్రహ్మోస్ క్షిపణులు.. రేపటి నుంచి సరఫరా..
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను మార్చి 21న ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన తీహార్ జైల్లో ఉన్నారు. అయితే ఆయనకు ప్రమాదం పొంచి ఉందని నాలుగో సంవత్సరం లా విద్యార్థి హైకోర్టులో పిటిషన్ వేశాడు. టిల్లూ తాజ్‌పురియా, అతిక్ అహ్మద్‌ల హత్యల ఉదాహరణలను ఉటంకిస్తూ జైలులో కేజ్రీవాల్ భద్రత ప్రమాదంలో ఉందని పిటిషన్‌లో పేర్కొన్నాడు. ‘వీ ది పీపుల్ ఆఫ్ ఇండియా’ పేరుతో ఈ పిల్ దాఖలైంది. దేశ రాజధానిలోని జైళ్లల్లో సరైన సమయంలో వైద్య సదుపాయాలు, సేవలు అందించకపోవడంతో చాలా మంది ఖైదీలు మరణించారని పిటిషన్‌లో వెల్లడించాడు.
ఇది కూాడా చదవండి: Karnataka: ప్రేమించడం లేదని కాంగ్రెస్ కార్పొరేటర్ కుమార్తె దారుణహత్య..
ఇక వారానికి మూడుసార్లు డాక్టర్‌తో వర్చువల్‌గా సంప్రదింపులు జరపాలని కోరుతూ కేజ్రీవాల్ చేసిన పిటిషన్‌పై గురువారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా తీపి టీ, మిఠాయిలు, లడ్డూలు, మామిడిపండ్లు మరియు ఆలూ పూరీ ఆహారాలు తీసుకుంటున్నారని ఈడీ ఆరోపించింది. ముఖ్యమంత్రికి సంబంధించిన డైట్ చార్ట్‌ను కోర్టు ముందు ఉంచింది. ఇక జైల్లో కేజ్రీవాల్‌ను చంపేందుకు ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ కుట్ర పన్నుతున్నాయని ఆప్ ఆరోపించింది . శుక్రవారం విలేకరుల సమావేశంలో అతిషి మాట్లాడుతూ ఈ ఆరోపణలు చేశారు. ఇంటి భోజనం ఆపేందుకే ఈడీ ఈ కుట్ర చేసిందని ఆప్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
ఇది కూాడా చదవండి: Pramod Sawant: హామీలు నెరవేర్చని కాంగ్రెస్‌ను ఇంటికి పంపించాలి