Prabhakar Rao : తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న మాజీ ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్‌లోని ప్రత్యేక విచారణ బృందం (SIT) ఎదుట సోమవారం హాజరయ్యారు. గత ప్రభుత్వంలో ఆయన ఎస్‌ఐబీ చీఫ్‌గా ఉన్న సమయంలో అనేకమంది ప్రముఖుల ఫోన్‌లు ట్యాప్ చేసినట్టు ఆరోపణలున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభాకర్ రావు నుండి కీలక సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని SIT భావిస్తోంది. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, న్యాయమూర్తులు, జర్నలిస్టుల ఫోన్లను ట్యాప్ చేసిన విషయంపై, అలాగే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలకు ఆర్థికంగా సహాయపడినవారిపై నిఘా పెట్టిన కోణంలో SIT ప్రశ్నలు సంధించనుంది.
ప్రభాకర్ రావు ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో దుబాయ్ ద్వారా హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అప్పటికే అతనిపై లుక్ ఔట్ సర్క్యులర్ అమలులో ఉండటంతో, ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయన వద్ద ఉన్న సుప్రీం కోర్టు ఆదేశాల ప్రతులు, వన్ టైం ఎంట్రీకు సంబంధించిన ఎమర్జెన్సీ సర్టిఫికేట్ తదితర పత్రాలను పరిశీలించారు. ఈ సమాచారం వెంటనే కేసు దర్యాప్తు బాధ్యత వహిస్తున్న జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరికి చేరింది. సోమవారం ఉదయం 10 గంటలకి ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లోని SIT కార్యాలయానికి హాజరయ్యారు. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల ప్రత్యేక బృందం ఆయనను ప్రశ్నిస్తోంది. ఈ విచారణలో ప్రభాకర్ రావు ఎలాంటి వెల్లడి చేస్తారన్నది ఇప్పుడు రాజకీయ, పోలీస్ వర్గాల్లో ఆసక్తిగా మారింది.