Perni Nani: ఏపీలో డేటా చోరీ జరుగుతోందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లానన్న పవన్ కల్యాణ్‌కు ఛాలెంజ్ చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పవన్‌కు అంత సాన్నిహిత్యమే ఉంటే.. కేంద్ర నిఘా సంస్థలతో దర్యాప్తు చేయించుకోవాలని సవాల్ విసిరారు. వాలంటీర్లు సేకరించే డేటా ఏపీలోనే భద్రంగా ఉందన్నారు పేర్ని నాని. వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, జగన్‌ను జైలుకు పంపిస్తామని పవన్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు పేర్ని నాని. చేతనైతే జగన్‌ను ఇంటికి పంపించాలని సవాల్ విసిరారు. దమ్ముంటే మూడు పార్టీలు ఏకమై జగన్‌ను జైలుకు పంపించాలని ఛాలెంజ్ చేశారు పేర్ని నాని.
వాలంటీర్ల నైతిక స్థైర్యం దెబ్బ తినకూడదని సంబంధిత శాఖ ఉన్నతాధికారి చర్యలకు ఉపక్రమించారు.. పవన్ కళ్యాణ్ పై కోర్టులో సవాలు చేయమని ఉత్తర్వులు జారీ చేశారు.. తప్పుడు వ్యాఖ్యలను జడ్జి భావిస్తే శిక్ష వేస్తారు.. అప్పుడు రెడీగా ఉండండి అంటూ సూచించారు పేర్నినాని.. ఇక, పవన్ కల్యాణ్ హాయిగా సినిమాలు చేసుకుంటున్నాడు.. పెట్టుబడి పెట్టే వారికి కదా రిస్క్ అని ప్రశ్నించారు నాని.. పవన్ కోసం పెట్టుబడి పెట్టే సినిమాల్లో నిర్మాతకు, రాజకీయాల్లో చంద్రబాబు రిస్క్ అని వ్యాఖ్యానించారు. జగన్ బలం వాలంటీర్ వ్యవస్థలో ఉందనే ఆ వ్యవస్థను టార్గెట్ చేశాడు.. ప్రజా సాధికారిక సర్వే పేరుతో చంద్రబాబుతో కలిసి డేటా చౌర్యం చేశారు. తెలంగాణ ప్రభుత్వం సంబంధిత బాధ్యులను అరెస్టు చేస్తే నోరు ఎందుకు విప్పలేదు? అని ప్రశ్నించారు.
నీ జనసేన సభ్యత్వం కావాలంటే.. ఫోన్ నెంబర్, ఈ మెయిల్, ఓటర్ ఐడీ, ఆడో, మగో కావాలి, ఏ ఊరో కావాలి.. మరి ఇదంతా డేటా చౌర్యం కాదా? అని ప్రశ్నించారు పేర్నినాని.. ఈ డేటా అంతా ఏం చేస్తున్నావ్? కేంద్ర ప్రభుత్వం సెన్సెస్ డేటాలో ఏం అడుగుతారో తెలుసా..! పేరు దగ్గర నుంచి వైవాహిక స్థితి వరకు, ఆదాయం, ఉద్యోగ వివరాలు, ఏ ఊర్లో ఎన్నాళ్ళు ఉన్నారు వంటి అన్ని వివరాలు తీసుకుంటారు.. చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాం అంటున్నావ్ గా మరి వెళ్లి అడుగు అంటూ సవాల్ చేశారు. ప్రజల వివరాలు మీకు ఎందుకు అని అడుగుతావా? డేటా మా సచివాలయంలో మా దగ్గరే ఉంది.. సై అంటే సై… ఎవరితో అయినా విచారణ చేయించుకో.. డేటా చౌర్యంపై మనోహరినో, కంప్యూటర్ ఆపరేటర్‌నో వెతికి పెట్టమని చెప్పు అంటూ సవాల్ చేశారు. నేషనల్ యూత్ వాలంటీర్ సిస్టమ్ ను కేంద్రం కూడా ప్రారంభించింది.. వీళ్ళకు గౌరవ వేతనం రోజుకు 260 రూపాయలు ఇస్తారు.. మరి వీళ్ళను ఎందుకు కేంద్రం వాలంటీర్లు అంటోంది.. వెళ్ళి అడగలేవా? దమ్ము లేదా? అంటూ మండిడ్డారు.
ప్రధాని నరేంద్ర మోడీ 8 ఏళ్లలో నన్ను ఎప్పుడూ పిలువలేదు అని వైజాగ్ లో చెప్పిన విషయం మర్చిపోయావా? అని ఎద్దేవా చేశారు నాని.. నీతి ఆయోగ్ రిపోర్ట్ చూశావా? నీతి ఆయోగ్ ఎవరిదో తెలుసా? అని ప్రశ్నించారు. ఇక, రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ ప్రభుత్వంలో పేదరిక శాతం 11.71 ఉండేది.. గత నాలుగేళ్ల జగన్ ప్రభుత్వంలో పేదరికం 6.06 శాతానికి తగ్గింది.. ఇది మోడీ ప్రభుత్వం ఇచ్చిన సర్టిఫికెట్ అన్నారు.. పవన్ కళ్యాణ్ ఇల్లు ఎక్కడ ఉంది? బ్యాంకు ఖాతాలు ఎక్కడ ఉన్నాయి. నీ డేటా అంతా కేసీఆర్ చేతిలో కదా ఉంది.. బలహీనులే నాకు ఫలానా వాళ్ళు తెలుసు అని చెప్పుకునేది.. అమిత్ షా పై రాళ్ళు వేయించింది ఎవరు? మోడీని తిట్టింది ఎవరు? ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? అంటూ ప్రశ్నించారు. మా ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో.. వస్తే చూపిస్తాం.. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్నది ప్రభుత్వ ఉద్యోగులు కాదా? అని నిలదీశారు. వాలంటీర్లకు ఇచ్చేది జీతం కాదు .. గౌరవ వేతనం అని తెలిపారు. వారు సేవ చేస్తుంటే తప్పుడు ఆరోపణలు చేస్తున్నావు.. సముద్రంలో బోలెడు నీళ్ళు ఉంటాయి .. తాగటానికి పనికి వస్తాయా? పవన్ కు, కేంద్రంతో బలమైన బంధం ఉంటే రాష్ట్రానికి ఏం ఉపయోగం? ప్రత్యేక హోదా గురించి ఒక్క మాట అయినా మాట్లాడావా? బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి ప్రభుత్వం నడిపినా కేంద్రం నుండి నిధులు తెచ్చారా? పదివేల కోట్లకు పైగా పెండింగ్ నిధులు తెచ్చిన జగన్ కదా మొనగాడు అన్నారు.. రాష్ట్రంలో పేదరికం పోవాలంటే జగన్ ప్రభుత్వం రావాలి.. బ్రోకర్ పనులు చేసే వారికి బాయ్ బాయ్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి పేర్నినాని.