CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.. తిరుమల – తిరుపతి, చంద్రగిరి ప్రాంతాల తాగునీటి అవసరాలకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నారు.. రూ.126 కోట్ల వ్యయంతో నీవా బ్రాంచ్ కెనాల్ నుంచి కల్యాణి డ్యామ్‌కు కృష్ణా జలాలను మళ్లించే పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు శంకుస్థాపన చేశారు. తిరుపతి సమీపంలోని మూలపల్లి చెరువు వద్ద నీళ్ల మళ్లింపు పనులకు సీఎం శంకుస్థాపన నిర్వహించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే తిరుమల, తిరుపతి, చంద్రగిరి ప్రాంతాల్లో తాగునీటి సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం లభిస్తుందని అధికారులు తెలిపారు.
ఇక, సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నారావారిపల్లెలో కొనసాగుతున్న పర్యటనలో భాగంగా.. సీఎం చంద్రబాబు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. స్వర్ణ నారావారిపల్లె ప్రాజెక్టులో భాగంగా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, టాటా డీఐఎంసీ, ఇండోర్ సబ్‌స్టేషన్, సీసీ రోడ్లను ప్రారంభించారు. అదేవిధంగా రంగంపేట, బీమావరం నుంచి శ్రీ శేషాచల లింగేశ్వరాలయానికి వెళ్లే బీటీ రోడ్డును సీఎం ప్రారంభించారు. ఈ రోడ్డు ప్రారంభంతో ఆలయానికి వెళ్లే భక్తులకు రాకపోకలు మరింత సులభంగా మారనున్నాయి. అయితే, తిరుమల–తిరుపతి ప్రాంతం దేశవ్యాప్తంగా కోట్లాది భక్తులు వచ్చే ప్రాంతమని, ఇక్కడ తాగునీటి అవసరాలు అత్యంత కీలకమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని శాశ్వత పరిష్కారాలే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల మౌలిక అవసరాల కల్పనలో భాగంగా ఇలాంటి ప్రాజెక్టులు మరిన్ని చేపడతామని తెలిపారు సీఎం నారా చంద్రబాబు నాయుడు..