Ponguleti Srinivas reddy : ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలంలోని రామచంద్రాపురం గ్రామాన్ని మోడల్ గ్రామంగా ఎంపిక చేసి అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేసి, పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో సరైన అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. అయితే, గత 15 నెలలుగా ఇందిరమ్మ పాలనలో రాష్ట్రం అభివృద్ధి బాటలో నడుస్తోందని తెలిపారు. ప్రతి పేదవాడికి అండగా నిలిచే విధంగా ప్రభుత్వం పని చేస్తోందని స్పష్టం చేశారు.
రాష్ట్రం అప్పుల బాదుడులో ఉన్నప్పటికీ, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాదిలోనే 57,626 ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో 10 లక్షల రూపాయల వరకూ ఉచిత వైద్యం అందిస్తున్నామని పేర్కొన్నారు. వచ్చే ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీని ప్రారంభిస్తామని వెల్లడించారు. దేశ చరిత్రలోనే తొలిసారి సన్న బియ్యానికి 500 రూపాయల బోనస్ అందించిన ప్రభుత్వం తమదేనని తెలిపారు.
యువత కోసం ఉపాధి కార్యక్రమాలు: నిరుద్యోగుల ఉపాధి కోసం ‘రాజీవ్ యువ వికాస్’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు చెప్పారు.
గత ప్రభుత్వ పాలనలో ఎన్నో అక్రమాలు జరిగాయని, వాటిని సరిచేస్తూ అప్పులను తీర్చుతున్నామని మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. అలాగే, మళ్లీ అధికారంలోకి వస్తామంటూ కలలు కంటున్నారని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మండిపడ్డారు. రామచంద్రాపురం గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టినట్టు మంత్రి వెల్లడించారు. ఇంకా మిగిలిన అర్హులందరికీ ఇళ్ల మంజూరుకు సంబంధించి అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. ఫారెస్ట్ , ప్రైవేట్ భూముల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
మాజీ ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టుపై అలసత్వం వహించిందని విమర్శించిన పొంగులేటి, ప్రస్తుత ప్రభుత్వం ఆ పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లిందని తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే చెరువులు నిండుగా ఉండేలా నీటి సరఫరా నిరంతరంగా ఉంటుందని, రైతులకు సాగునీటి కోసం ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజలు గమనించి, భవిష్యత్తులో జరిగే ఏ ఎన్నికల్లోనైనా ఇందిరమ్మ ప్రభుత్వానికి మద్దతు తెలియజేయాలని మంత్రి పొంగులేటి ప్రజలను కోరారు.
Child Trafficking : చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో సంచలన విషయాలు.. వాళ్లే టార్గెట్