ప్రత్తిపాడు నియోజకవర్గంలోని పెదనందిపాడు మండల పర్యటనలో భాగంగా నియోజకవర్గ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి బూర్ల రామాంజనేయులుతో కలిసి గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ శుక్రవారం నాడు పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా నాగభైరవ పాలెం, జరుగు వారి పాలెం, ఉప్పలపాడు, పరిటాల వారి పాలెం, అన్నవరం, రాజుపాలెం, పాలపర్రు, అభినయని గుంట పాలెం, గిరిజవోలు గుంట పాలెం, గోగులమూడి, కాట్రపాడు, కుసులూరు గ్రామాల్లో పర్యటించారు. కాగా ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ.. టీడీపీ అధికారంలోకి రాగానే ప్రతి ఇంటికి కులాయి కనెక్షన్లు వచ్చేలా కృషి చేస్తామన్నారు. నకిలీ విత్తనాలు, ఎరువులు మార్కెట్లోకి రాకుండా అరికడతామని తెలిపారు. అలాగే, రైతుల ప్రోత్సాహకాల నిమిత్తం పసుపు, మిర్చి, టమాటో ఇతర పంటల అభివృద్ధికి సహకరిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. సీఎస్ఆర్ రాజ్యసభ నిధులతో అభివృద్ధికి పునాది వేస్తానని పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. విద్యార్థులకు ఉపాధి అవకాశాలు సులభతరమయ్యేలా స్కిల్ డెవలప్మెంట్ కు అవసరమైతే సొంత ఖర్చులతో అందిస్తానని స్పష్టం చేశారు.
Read Also: DC vs MI: సొంత గడ్డలో వీరవిహారం చేసిన ఢిల్లీ బ్యాటర్లు.. ముంబై టార్గెట్ 258..
అలాగే, గుంటూరులోని అమరావతి రోడ్డులో గల స్వగృహ కన్వెన్షన్లో బీసీ రాష్ట్ర సంక్షేమ సంఘం ఎన్డీయే కూటమికి మద్దతు తెలుపుతూ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా బీసీ సంఘం నాయకులతో పాటు పెమ్మసాని చంద్రశేఖర్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. టీడీపీ మాత్రమే ఒక ఎర్రన్నాయుడుని, దేవేందర్ గౌడ్, కేఈ కృష్ణమూర్తి లాంటి ఎంతో మంది నాయకులను తయారు చేసిందన్నారు. మా ప్రభుత్వం వచ్చాక ఇసుక పాలసీపై తగిన నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. బీసీ సంఘాల నాయకులందరూ మళ్ళీ వెనక్కి వచ్చి ఎన్డీయే కూటమికి మద్దతు ఇవ్వడం ఎంతో సంతోషకరమైన అంశం అని గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు.