గుంటూరులోని తూర్పు నియోజకవర్గంలోని 6, 57 డివిజన్లలోని సుమారు 350 మంది నేతలు శనివారం నాడు టీడీపీలో చేరారు. పార్టీలో చేరుతున్న వారిని గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో గుంటూరు పేరును ఇండియా మొత్తం వినపడేలా చేస్తానని అన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక రెండు సెంట్లలో ఇళ్ల నిర్మాణం లేదా టిట్కో ఇళ్ల అందజేత ద్వారా పేదలకు నివాస సౌకర్యం కల్పిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. నిరుద్యోగ సమస్యను తరిమికొట్టే విధంగా ఇండస్ట్రీలు తెస్తామన్నారు. ఇంటి నుంచి బయటకు రాలేని మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉపాధి అవకాశాలకు కృషి చేస్తామన్నారు.
కాగా, గుంటూరులోని తూర్పు నియోజకవర్గంలో పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా 50, 51, 52, 53, 54, 55, 56 డివిజన్లలో నియోజకవర్గ అసెంబ్లీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మహమ్మద్ నసీర్ అహ్మద్ తో కలిసి పెమ్మసాని పర్యటించారు. ప్రచారంలో భాగంగా ప్రజలను కలుసుకుంటూ ముందుకు సాగారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి పెమ్మసారి మాట్లాడుతూ.. ఈ జన ప్రభంజనాన్ని చూస్తుంటే టీడీపీ స్వీప్ చేస్తుందని స్పష్టమవుతుంది. నా శక్తి మేరకు ప్రజలకు మేలు చేస్తానే తప్ప ఎవరి కష్టాన్ని దోచుకోవాల్సిన పని లేదన్నారు.