ఈ ఏడాది జరగబోయే ఆసియా కప్ విషయంలో ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. వాస్తవానికి ఈసారి టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. కానీ భద్రతా కారణాల దృష్ట్యా పాక్‌లో టోర్నీ నిర్వహిస్తే తాము ఆడబోమని ఇప్పటికే బీసీసీఐ స్పష్టం చేసింది. తటస్ఠ వేదికపై నిర్వహించాలని పట్టుబడుతోంది. ప్రస్తుతం ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఛైర్మన్‌గా ఉన్న బీసీసీఐ సెక్రటరీ జైషా కూడా ఇదే మాట చెప్పారు. ఈసారి టోర్నీని న్యూట్రల్ వేదికలోనే నిర్వహిస్తామని తేల్చి చెప్పేశారు. ఇదే విషయమై ఏసీసీ అత్యవసర సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఏసీసీ ప్రెసిడెంట్, బీసీసీఐ సెక్రటరీ జైషాతో పీసీబీ ఛైర్మన్ నజామ్ సేథీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆసియా కప్ నిర్వహణపై మాట్లాడారు. కానీ ఈ చర్చలూ ఓ కొలిక్కి వచ్చినట్లు కనిపించడం లేదు. ఈ మీటింగ్‌లో ఏసీసీకి పాకిస్తాన్ చాలా స్పష్టంగా వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఆసియా కప్‌ను హోస్ట్ చేసే విషయంలో పాక్ చాలా క్లారిటీగా ఉందని, ఈ వేదికను కనుక మారిస్తే భారత్‌లో జరగబోయే వరల్డ్ కప్‌ను తాము బాయ్‌కాట్ చేస్తామని తేల్చిచెప్పిందట పీసీబీ.
Also Read: Sohail Khan: కోహ్లీ కంటే రోహిత్ గొప్ప బ్యాటర్: పాక్ మాజీ పేసర్
పెషావర్‌లో బాంబు దాడి తర్వాత శ్రీలంక, బంగ్లాదేశ్ కూడా పాక్‌కు వచ్చేందుకు సంకోచిస్తున్నాయన్న వార్తలపై పీసీబీకి చెందిన కొందరు అధికారులు స్పందించారు. అలాంటిదేం లేదని, ఏసీసీ మీటింగ్‌లో చర్చంతా భారత్, పాకిస్తాన్ సంబంధాల చుట్టూనే తిరిగిందని చెప్పారు. ఈ సమావేశానికి వెళ్లే ముందు పీసీబీ చీఫ్ నజామ్ సేథీ.. పాక్ ప్రెసిడెంట్‌ను కలిసినట్లు సమాచారం. ఆయనతో మాట్లాడిన అనంతరం ఆసియా కప్, ఛాంపియన్స్ ట్రోఫీ రెండింటికీ భద్రత కల్పించేందుకు ప్రెసిడెంట్ అంగీకరించారని, భారత జట్టుకు కూడా రక్షణ కల్పిస్తామని సేథీ చెప్పాడు. అలాంటప్పుడు టీమిండియాను పాకిస్తాన్ పంపడంలో బీసీసీఐకి సమస్య ఏంటని ప్రశ్నించాడు. పాకిస్తాన్ వచ్చేందుకు భారత ప్రభుత్వం నుంచి కనుక బీసీసీఐ క్లియరెన్స్ తీసుకోలేకపోతే.. తాము కూడా పాక్ జట్టును భారత్‌కు పంపబోమని స్పష్టం చేశాడు. ఈ సమావేశంలో ఆసియా కప్ వేదికపై ఒక నిర్ణయం తీసుకోకపోవడంతో మార్చి నెలలో మరోసారి సమావేశం అవ్వాలని ఏసీసీ నిర్ణయించింది.
Also Read: Asifabad Bus accident: బస్సునుంచి బయటకు దూకిన డ్రైవర్.. కారణం ఇదే..
తర్వాతి సమావేశంలోపు భారత ప్రభుత్వాన్ని బీసీసీఐ ఈ విషయంలో సంప్రదించాలని, బీసీసీఐ నిర్ణయం చెప్తే తాము కూడా వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ గురించి ఐసీసీతో చర్చించాల్సి ఉంటుందని సేథీ స్పష్టం చేశాడట. అసలు ఈ సమస్య అంతా ఉందనుకుంటే.. ఆసియా కప్, ఛాంపియన్స్ ట్రోఫీ హోస్ట్‌గా పాక్‌ను ఎంపిక చేసినప్పుడు బీసీసీఐ ప్రతినిధులు ఎందుకు అడ్డుకోలేదని సేథీ ప్రశ్నించాడు. అంతకుముందు రమీజ్ రజా కూడా భారత జట్టు పాకిస్తాన్ రాకుంటే.. తాము వరల్డ్ కప్‌ను బాయ్‌కాట్ చేస్తామని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సేథీ కూడా అవే వ్యాఖ్యలు చేయడం క్రీడా వర్గాల్లో దుమారం రేపుతోంది.