ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో మూడు వేర్వేరు జట్లను ఫైనల్‌కు తీసుకెళ్లిన ఏకైక కెప్టెన్‌గా నిలిచాడు. అహ్మదాబాద్‌లో ఆదివారం రాత్రి జరిగిన ఐపీఎల్ 2025 క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను పంజాబ్ కింగ్స్ చిత్తు చేసి ఫైనల్‌కు దూసుకెళ్లింది. దాంతో శ్రేయస్ ఖాతాలో ఈ అరుదైన ఘనత చేరింది. ఈ ఘనత దిగ్గజాలు ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ వల్ల కూడా కాలే. అయితే ఈ ఇద్దరు ఎక్కువ కాలం ఒకే జట్టుకు ఆడారు. 2017లో రైజింగ్ పూణే సూపర్‌జైంట్ ఫైనల్‌కు వెళ్లినా.. ధోనీ సారథి కాదు. ఐపీఎల్ ఆరంభంలో డెక్కన్ ఛార్జర్స్ తరఫున రోహిత్ ఆడినా అతడు కెప్టెన్ కాదు.
ఐపీఎల్ 2020లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును శ్రేయస్ అయ్యర్ ఫైనల్‌కు తీసుకెళ్లాడు. ఫైనల్లో ముంబై ఇండియన్స్ చేతిలో ఢిల్లీ ఓడిపోయింది. ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఫైనల్‌కు చేర్చడమే కాకుండా.. టైటిల్ కూడా అందించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును కేకేఆర్ ఓడించింది. ఇప్పుడు పంజాబ్ కింగ్స్‌ను శ్రేయస్ ఫైనల్‌కు చేర్చాడు. శ్రేయస్ ఊపు చూస్తే ఈసారి పంజాబ్ తన టైటిల్ కలను నెరవేచుకునేలా కనబడుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. శ్రేయస్‌ను ఐపీఎల్ 2025 మెగా వేలంలో రూ. 26.75 కోట్లకు పంజాబ్ సొంతం కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
శ్రేయస్ అయ్యర్ రికార్డు:
ఐపీఎల్ 2020 – ఢిల్లీ క్యాపిటల్స్ (రన్నరప్)
ఐపీఎల్ 2024 – కోల్‌కతా నైట్ రైడర్స్ (విన్నర్)
ఐపీఎల్ 2025 – పంజాబ్ కింగ్స్ (ఆర్సీబీతో జూన్ 3న ఫైనల్ మ్యాచ్)