ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. వర్షం కారణంగా రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో ముందుగా ముంబై 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ఛేదనలో పంజాబ్ మరో ఓవర్ మిగిలి ఉండగానే 5 వికెట్స్ కోల్పోయి 207 పరుగులు చేసి.. ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. ఇక మంగళవారం జరిగే ఫైనల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. అయితే ఫైనల్‌కు చేరిన సంతోషంలో ఉన్న పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు బీసీసీఐ బిగ్ షాక్ ఇచ్చింది.
ముంబై ఇండియన్స్‌తో జరిగిన క్వాలిఫయర్ 2లో పంజాబ్ కింగ్స్ జట్టు స్లో ఓవర్ రేట్‌ను నమోదు చేసింది. స్లో ఓవర్ రేట్‌ను కొనసాగించినందుకు గాను రూ.24 లక్షల జరిమానాను బీసీసీఐ విధించింది. పంజాబ్ ప్లేయింగ్ ఎలెవన్‌లోని మిగిలిన సభ్యులకు (ఇంపాక్ట్ ప్లేయర్‌తో సహా) రూ.6 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం (ఏది తక్కువైతే అది) జరిమానా పడింది. ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ జట్టు స్లో ఓవర్ రేట్‌ను నమోదు చేయడం ఇది రెండోసారి. మొదటిసారి కేవలం సారథికి మాత్రమే ఫైన్ పడుతుందన్న విషయం తెలిసిందే.
మరోవైపు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా స్లో ఓవర్ రేట్‌ను నమోదు చేసినట్లు తెలుస్తోంది. పాండ్యాకు రూ.30 లక్షల జరిమానా.. మిగిలిన ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ ఎలెవన్‌కు రూ.12 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించినట్లు సమాచారం. ఇదే నిజమైతే పాండ్యాపై ఓ మ్యాచ్ నిషేధం పడుతుంది. ఎందుకంటే ఐపీఎల్ 2025లో మూడోసారి స్లో ఓవర్ రేట్ నమోదు చేస్తే జరిమానాతో పాటు బ్యాన్ కూడా పడుతుంది. గతేడాది కూడా హార్దిక్ మూడుసార్లు స్లో ఓవర్ రేట్ నమోదు చేసి.. ఓ మ్యాచ్ నిషేధంకు గురయ్యాడు. ఈ సీజన్ ఆరంభం మ్యాచుకు అతడు దూరమయ్యాడు.