Kavya Thapar Watch Telugu Titans Match in Hyderabad: ఎట్టకేలకు తెలుగు టైటాన్స్ ఓ విజయాన్ని అందుకుంది. ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్‌లో వరుసగా 7 ఓటముల తర్వాత విజయం సాధించింది. 14 మ్యాచ్‌ల్లో రెండో గెలుపును ఖాతాలో వేసుకుంది. అంతేకాదు ఈ సీజన్‌లో తొలిసారి ఆలౌట్ కాకుండా తెలుగు టైటాన్స్ నిలిచింది. శనివారం రాత్రి గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 49-32 తేడాతో యూపీ యోధాస్‌ను టైటాన్స్ ఓడించింది. కెప్టెన్ పవన్ సెహ్రావత్ (16), ఓంకార్ పాటిల్ (10) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
తెలుగు టైటాన్స్ మ్యాచ్ ఆరంభం నుంచి జోరు ప్రదర్శించింది. పదో నిమిషంలోనే యూపీ యోధాస్‌ను ఆలౌట్ చేసింది.14వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన ఓంకార్ పాటిల్.. ఒకే రైడ్‌లో నాలుగు పాయింట్లు తెచ్చాడు. మరోవైపు పవన్ సెహ్రావత్ పాయింట్స్ తేవడంతో తెలుగు టైటాన్స్ తొలి అర్ధభాగాన్ని 24-16తో ముగించింది. విరామం తర్వాత పవన్, ఓంకార్ నిలకడగా ఆడడంతో టైటాన్స్ దూకుడు కొనసాగించింది. ఆధిక్యాన్ని కొనసాగించిన తెలుగు జట్టు 49-32తో విజయం సాధించింది.
Also Read: Atlee : అట్లీ, పవన్ కల్యాణ్ కాంబోలో మూవీ.. నిర్మాతగా గురూజీ..?
యూపీ యోధాస్ జట్టులో పర్దీప్ నర్వాల్ (10), గగన గౌడ (7) ఆకట్టుకున్నారు. ఈ ఇద్దరు మినహా పెద్దగా ఎవరూ రాణించలేదు. సొంతగడ్డపై విజయం సాధించడంతో తెలుగు ఫాన్స్ ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలుగు టైటాన్స్ పట్టికలో చివరి స్థానంలో ఉంది. అంతకుముందు జరిగిన మరో మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ 39-33తో యు ముంబాపై గెలిచింది. ఈ మ్యాచ్‌లను హీరోయిన్ కావ్య థాపర్ వీక్షించారు. అభిమానవుల మధ్య ఆమె సందడి చేశారు. కావ్య ఇండోర్ స్టేడియంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.