Pawan Kalyan: బీజేపీ లాంటి పార్టీ తెలంగాణలో జనసేనతో పని చేసిందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కూకట్‌పల్లిలో అమిత్ షా వచ్చి ప్రచారం చేశారని.. బీజేపీకి క్యాడర్ లేక నేతలు లేక కాదు, జనసేనలో యువత కమిట్‌మెంట్ చూసి పార్టీని గుర్తించారన్నారు. ఏపీలో ఇంకా 100 రోజుల సమయం ఉందన్నారు. 3 నెలల్లో సమిష్టిగా మనం చేసే పని 5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మంచి చేస్తుందన్నారు. జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, జన సేన పీఏసీ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, నాగబాబుతో పాటు పలువురు ముఖ్యనేతలు హాజరయ్యారు.
ప్రాంతీయ పార్టీలను పక్కన పెట్టే బీజేపీ జనసేన పార్టీని దగ్గరకు తీసుకుందన్నారు. కమిట్‌మెంట్‌తో పని చేయటమే ఇందుకు కారణమన్నారు. ఏపీలో టీడీపీ, తెలంగాణలో బీజేపీతో జనసేన పొత్తుపై పవన్ క్లారిటీ ఇచ్చారు. ఏపీలో టీడీపీ, తెలంగాణలో బీజేపీ జనసేన కలవటంపై వైసీపీ విమర్శలు చేస్తోందన్నారు. ప్రజల మంచి కోసమే నిర్ణయాలు తీసుకుంటాయని.. దీని వెనుక వ్యూహాలు ఉంటాయని పవన్‌కళ్యాణ్ పేర్కొన్నారు. అసలు ఈ మాట అనటానికి వైసీపీకి అర్హత లేదన్నారు. తెలంగాణలో ఓటింగ్‌పై పవన్ వ్యాఖ్యానించారు. హైద్రాబాద్‌లో 50 శాతం కూడా పోలింగ్ జరగలేదన్నారు. యువత ఓటింగ్‌కు దూరంగా ఉండటం బాధ కలిగిందన్నారు.
Read Also: Caste Boycott: ఎంత అమానుషం!.. తిరునాళ్లకు చందాలు ఇవ్వలేదని కుల బహిష్కరణ
తాను ఏం చేసినా కోట్లాది మందిని దృష్టిలో పెట్టుకొని మాత్రమే చేస్తానని పవన్ చెప్పారు. టీడీపీ, జనసేన కలిసి వెళ్లటానికి కారణాలు ఉన్నాయన్నారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పని చేస్తాయని.. వైసీపీని ఎదుర్కొంటానికి టీడీపీ, జనసేన కలిశాయన్నారు. ప్రతిపక్షం బతకాల్సిన పరిస్థితి ఉందన్నారు. వైసీపీ పాలనలో మెగాస్టార్‌ను, సూపర్ స్టార్‌ను బెదిరించే పరిస్థితి ఉందని తీవ్రంగా మండిపడ్డారు. సీఎం పదవి ఎవరిది అని ప్రశ్నిస్తున్నారని.. నన్ను ఎమ్మెల్యేగా గెలిపించలేదు.. నాకు ఓటు వేసిన వారు ఈ ప్రశ్న అడిగితే గౌరవంగా ఉంటుందని పవన్ పేర్కొన్నారు. కానీ ఓటు వేయని వారు ఇపుడు సీఎం చేస్తాం అంటున్నారన్నారు. తనకు అన్నీ కులాలు సమానమేనన్న పవన్ కళ్యాణ్.. కులాలను ప్రోత్సహిస్తే కుల నాయకుడు అవుతామన్నారు. తాను గత ఎన్నికల్లో ఓటమి పాలైతే అందరూ విమర్శలు చేశారని.. నాదెండ్ల మాత్రం నా వెనుక ఉన్నారు అందుకే ఆయన అంటే గౌరవమన్నారు.
జనసేన పీఏసీ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. టీడీపీ భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమంలో జన సేన పార్టీ నేతలు కూడా పాల్గొనాలని సూచించారు. భవిష్యత్ గ్యారెంటీ పత్రంలో చంద్రబాబు, పవన్ ఇద్దరి ఫోటోలు ఏర్పాటు చేశారన్నారు. రెండు పార్టీలు సమన్వయంతో ముందుకు వెళ్తున్న విషయం ప్రజల్లోకి కలిసి పని చేయటం ద్వారా మరింత తీసుకు వెళ్ళాలన్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, అక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్ళాలని కార్యకర్తలకు సూచించారు.