Pawan Kalyan: విశాఖ రాజధానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. జనసేనాని చేపట్టిన మూడో విడత వారాహి విజయయాత్ర ఈ రోజు విశాఖలోముగిసింది.. రెండు వారాహి బహిరంగ సభల్లో పాల్గొన్న పవన్.. 4 ఫీల్డ్ విజిట్స్ చేశారు. విశాఖలో భూలు ఆక్రమణలకు గురవుతున్నాయి.. అధికార పార్టీ నేతల అండతో కబ్జా చేస్తున్నారంటూ.. పర్యావరణాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించిన విషయం విదితమే. ఇక, వారాహి యాత్ర ముగింపు సందర్భంగా మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్.. మూడోవిడత వారాహి యాత్ర సక్సెస్ అయ్యిందన్నారు. ప్రభుత్వంపై కోపం, జనసేన పోరాటం ప్రజల్లో కనిపించిందన్న ఆయన.. తెలంగాణ నుంచి ఆంధ్రావాళ్లను తరిమి వేయాలనే కోపం పెరగడానికి జగన్ కూడా కారణం అన్నారు.. అందుకే వరంగల్ లో విద్యార్థులు వైఎస్ జగన్‌ను తరిమికొట్టారని గుర్తుచేశారు.
ఇక, ఉత్తరాంధ్రను గుప్పెట్లో పెట్టుకోవడానికి తప్ప విశాఖ రాజధానిపై పాలకులకు ప్రత్యేక మైన ప్రేమ లేదంటూ విశాఖ రాజధానిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు పవన్.. జనవాణిలో వచ్చిన ఫిర్యాదుల్లో ఎక్కువ శాతం భూదోపిడీలకు సంబంధించినవే అన్నారు.. అయితే, ఉత్తరాంధ్రపై నాకు అపారమైన ప్రేమ ఉందని తెలిపారు. సహజవనరులు ఉండి ఇక్కడ నుంచి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి.. కాలుష్యం కారణంగా ఎదురవుతోన్న వ్యాధుల వల్ల నష్టపోతోందన్నారు. మరోవైపు.. లా అండ్ ఆర్డర్ విషయంలో బీహార్ కంటే ఏపీలో పరిస్థితులు దిగజారిపోయాయని ఆరోపించారు జనసేనాని.. ఉత్తరాంధ్ర ప్రజలు, యువత ఒక విధంగా ఆలోచిస్తే నాయకత్వం మరో విధానంలో ఆలోచిస్తోందన్న ఆయన.. బాక్సైట్ పేరుతో లేటరైట్ తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయన్నారు. అడ్డగోలుగా ఖనిజాలు తవ్వకాలు చేస్తే తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు.. ఆడపిల్లల అదృశ్యంపై విచారణ జరుపుతామని కూడా పోలీసులు చెప్పలేకపోవడం ఇబ్బందికరంగా ఉందన్నారు పవన్ కల్యాణ్… చిత్తూరు ఎస్పీ నాకు క్లాస్ పీకే ప్రయత్నం చేశారు.. అమ్మాయిల అదృశ్యంపై ఫిర్యాదులు రావడం లేదంటున్నారు. ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరిగితే తల్లిదండ్రుల పెంపకం లోపం అని హోమంత్రి చెబుతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశాంతంగా ఉండే విశాఖ నగరంలో రేసింగ్ లు ఎక్కువయ్యాయని విమర్శించారు. 15 వేల కోట్ల రూపాయల విలువైన ఖనిజాలు అక్రమం తవ్వకాలు జరిగాయని ఆరోపించారు.. ఆటో డ్రైవర్ పేరుతో లీజు తీసుకుని బినామీలు తవ్వకాలు చేస్తున్నారని దుయ్యబట్టారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.