ఢిల్లీ: జనసేన. బీజేపీ లక్ష్యం జగన్ ఓటమే.. జగన్ నుంచి ఏపీకి విముక్తి కలగాలి.. బీజేపీ అధిష్టానంతో అన్ని కోణాల నుంచి చర్చించాం.. ఈ భేటీ సత్ఫలితాలు ఇస్తుంది… వైసీపీ వ్యతిరేక ఓటు అంశం మీదే ఫోకస్ పెట్టాం… పొత్తుల గురించి ఇంకా ఆలోచించలేదు.. అధికారం సాధించేందుకు అడుగులు వేస్తున్నాం అన్నారు పవన్ కళ్యాణ్.
రాష్ట్ర శ్రేయస్సే ధ్యేయంగా పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన పై జనసేన ప్రకటన విడుదల చేసింది.
• వైసీపీ విముక్త ఆంధ్ర ప్రదేశ్… ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వని దిశగా చర్చలు
• బీజేపీ జాతీయ అధ్యక్షులు శ్రీ జె.పి.నడ్డా గారు, ముఖ్య నేతలతో కీలక భేటీలు
• కేంద్ర నాయకత్వం దృష్టికి రాష్ట్ర పరిణామాలు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శ్రేయస్సే ధ్యేయంగా… రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని పలు కీలక అంశాలపై కేంద్ర నాయకత్వంతో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చర్చించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి రెండు రోజుల ఢిల్లీ పర్యటన మంగళవారం రాత్రి ముగిసింది. సోమ, మంగళ వారాల్లో భారతీయ జనతా పార్టీ ముఖ్య నేతలతో కీలక భేటీలు సాగాయి. మంగళవారం రాత్రి బీజేపీ జాతీయ అధ్యక్షులు శ్రీ జె.పి.నడ్డా గారిని ఆయన నివాసంలో కలిశారు. సుమారు 45 నిమిషాల సాగిన ఈ సమావేశంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పాల్గొన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న వర్తమాన రాజకీయ పరిణామాలపై చర్చించారు. పాలన సంబంధితమైన అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు కరవైన పరిస్థితిని, అవినీతి తదితర విషయాలను కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైసీపీ పాలన నుంచి విముక్తం చేయడం, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వని దిశగా చర్చలు చేశారు. లోతుగా ఈ చర్చలు చేశారు. ఈ రెండు రోజులపాటు సాగిన చర్చల సత్ఫలితాలు రాబోయే రోజుల్లో ప్రజలకు అందుతాయి అని శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. సోమ, మంగళవారాల్లో కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి, బీజేపీ ఏపీ వ్యవహారాల ఇంఛార్జి శ్రీ వి.మురళీధరన్ గారితో రెండు దఫాలు చర్చలు చేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ శివప్రకాష్ జీతో కూడా చర్చలో పాల్గొన్నారు.
రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన విషయాలు, ప్రధాన ప్రాజెక్టుల గురించి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కేంద్ర నాయకత్వానికి తెలియచేశారు. ఇందులో భాగంగా కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారితో భేటీ అయ్యారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ సత్వరమే పూర్తి చేయాలని విజ్ఞప్తి చేసి, ఈ ప్రాజెక్ట్ విషయంలో వైసీపీ ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యాన్ని షెకావత్ గారి దృష్టికి తీసుకువెళ్లారు పవన్.