ఆంధప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీలు అభ్యర్థులను ప్రకటించేశాయి. అభ్యర్థులు కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఏపీలో అధికార పార్టీ వైసీపీ ఒంటరిగా బరిలోకి దిగుతుంటే… టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడిగా బరిలోకి దిగుతున్నాయి. వైసీపీ అన్ని సీట్లకు అభ్యర్థులను ప్రకటించేసింది. ఇక కూటమి మాత్రం కొన్ని సీట్లు మినహా మిగతా అభ్యర్థులను ప్రకటించేశాయి. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తున్నారు.. ఇక జనసేనాని కూడా రంగంలోకి దిగుతున్నారు. ఆయన పోటీ చేస్తున్న పిఠాపురంలో ఎన్నికల ప్రచారం చేసేందుకు షెడ్యూల్ ఖరారైంది.
కాకినాడ జిల్లా పిఠాపురంలో ఈ నెల 30 నుంచి పవన్‌కల్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈనెల 30 నుంచి మూడు రోజుల పాటు ఆయన పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. 30న నియోజకవర్గస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అలాగే శ్రీపాద వల్లభుడుని పవన్ దర్శించుకోనున్నారు. 31న ఉప్పాడ సెంటర్‌లో వారాహి యాత్ర బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఇక ఏప్రిల్ 1వ తేదీన పార్టీలో చేరికలు, నియోజకవర్గంలోని మేధావులతో సమావేశం కానున్నారు. మూడు రోజులు కూడా పిఠాపురంలోనే పవన్‌కల్యాణ్ బస చేయనున్నారు.
ఇక మే 13న ఆంధ్రప్రదేశ్‌లో ఒకే విడతలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. 175 అసెంబ్లీ స్థానాలకు, 25 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పవన్‌కల్యాణ్ పోటీ చేస్తున్నారు. ఇక వైసీపీ అధినేత జగన్ కూడా ఈనెల 27 నుంచి బస్సు యాత్ర చేస్తున్నారు. ఇలా రాష్ట్రమంతా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.