Pawan Kalyan: పుంగనూరు ఘటన విషయంలో అధికార వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. రాష్ట్రంలో వైసీపీ సర్కార్ వైఖరి ప్రతిపక్షం గొంతు నొక్కేలా ఉంది. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు వైసీపీ నాయకుల అరాచకాలతో ఇబ్బందులుపడుతున్నారు. ప్రజల తరఫున పోరాడటం ప్రతిపక్షాల బాధ్యత అన్నారు. ఈ రోజు పుంగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు వాంఛనీయం కాదు. ఆయన పర్యటనను అడ్డుకొనేందుకు వైసీపీ వ్యక్తులు రాళ్ళ దాడులకు పాల్పడటం, వాహనాలు ధ్వంసం చేయడం అధికార పార్టీ హింసా ప్రవృతిని తెలియచేస్తోంది. వారి నియంతృత్వం పెచ్చరిల్లుతోంది. పుంగనూరులో చోటు చేసుకున్న పరిణామాలను ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలి పిలుపునిచ్చారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
ఇక, పుంగనూరులో జరిగిన విధ్వంసాన్నికి కారణం మంత్రి పెద్దిరెడ్డియే అన్నారు చంద్రబాబు.. ఈ రోజు ఘటనపై విచారణ జరపాలి, బాధ్యతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది పెద్దిరెడ్డి తాత జాగీరా..? పెద్దిరెడ్డి పెద్ద పుండింగా..? ప్రజలు తిరుగుబాటు చేస్తే ఎలా ఉంటుందో చూశారుగా..? ఇది ఆరంభం మాత్రమేనని హెచ్చరించారు. టీడీపీ కార్యకర్తలు నరకాన్ని చూసారు.. పిల్లి కూడా రూమ్ లో పెడితే కొడితే పులి అవుతుంది… పుంగనూరులో అదే జరిగిందన్నారు.. దెబ్బలు తగిలిలా.. తలలు పగిలినా.. భయపడకుండా ఉన్నారు. పెద్దిరెడ్డికి చల్లా బాబుకు సరైనా మొగుడు దోరికాడు అన్నారు. మంచివాడు ఎదురు తిరిగితే ఎలా ఉంటుందో చూపించారని వ్యాఖ్యానించారు. మరోవైపు చంద్రబాబు వైఖరి వల్లే పుంగనూరు ఘటన అని అధికార వైసీపీ ఆరోపిస్తోంది. పుంగనూరులో రెచ్చ గొట్టి, దాడికి ఉసిగొల్పింది చంద్రబాబు అని ఆరోపించిన సజ్జల.. చంద్రబాబు సానుభూతి నాటకం పుంగనూరులో బయటపడిందన్నారు. ఆయనే రెచ్చ గొట్టి దాడులకు ఉసి గొల్పి సానుభూతి పొందే నాటకం చేస్తారని. కానీ, చంద్రబాబు నాటకం రక్తి కట్టకపోగా.. ఆయన అసలు స్వరూపం బయటపడిందన్నారు. అయితే, పుంగనూరు ఘటనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.. ఎన్నికల సంఘం దృష్టికి తీసుకు వెళ్తాం అని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో 23 సీట్లతో తెలుగుదేశం పార్టీని కొన ఊపిరితో వదిలిన ప్రజలకు.. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని భూ స్థాపితం చేయాలని విజ్ఞప్తి చేశారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.
మరోవైపు, పుంగనూరు ఘటనపై స్పందించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.. చంద్రబాబు రౌడీ మూకలను రెచ్చగొట్టారన్న ఆయన.. డబుల్ బ్యారెల్ గన్స్ కూడా పెట్టుకుని వచ్చారని ఆరోపించారు. చంద్రబాబు మాటలకు రెచ్చిపోయి పోలీసు వాహనాలపై వారు దాడి చేశారు. ఒక పద్ధతి ప్రకారం మొత్తం చేశారు. చంద్రబాబుకు దిగజారుడు తనం, నిరాశా నిస్పృహతో ఇలాంటి చర్యలకు ఒడికట్టారని విమర్శించారు. చంద్రబాబు నాయుడును మొదటి ముద్దాయిగా కేసు నమోదు చేయాలని సూచించారు. దౌర్జన్యానికి పాల్పడిన వారి వీడియోలు కూడా స్పష్టంగా ఉన్నాయన్న ఆయన.. కావాలనే చంద్రబాబు రెచ్చ గొట్టారని ఆరోపించారు మంత్రి పెద్దిరెడ్డి.