Neeraj Chopra At Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ ఇప్పటి వరకు మూడు పతకాలు మాత్రమే సాధించింది. షూటింగ్‌లోనే ఆ మూడు పతకాలు దక్కాయి. అయితే ఇప్పటి వరకు ఒక్క గోల్డ్ మెడల్ కూడా భారత్ ఖాతాలో చేరలేదు. దాంతో ఇప్పుడు అందరి ఆశలు టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత, జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రాపైనే ఉన్నాయి. నీరజ్ ఈసారి కూడా గోల్డ్ మెడల్ తెస్తాడని భారత అభిమానులు ధీమాగా ఉన్నారు. ప్రస్తుతం దేశం మొత్తం నీరజ్ చోప్రా నామస్మరణతో ఊగిపోతోంది.
పురుషుల జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ ఈవెంట్ మంగళవారం ప్రారంభం కానుంది. జావెలిన్ త్రోలో అథ్లెట్లను రెండు గ్రూపులుగా విభజించారు. భారత్ నుంచి నీరజ్ చోప్రాతో పాటు 2022 ఆసియా క్రీడల రజత పతక విజేత కిషోర్ జెనా కూడా పోటీపడనున్నాడు. ఇద్దరు రెండు వేర్వేరు గ్రూపులలో ఉన్నారు. మధ్యాహ్నం 1.50, మధ్యాహ్నం 3.20కి జరిగే క్వాలిఫికేషన్ రౌండ్‌లలో మనోళ్లు బరిలోకి దిగనున్నారు. ఆగష్టు 6న జరిగే క్వాలిఫికేషన్ రౌండ్‌లో అర్హత సాధిస్తే.. ఆగష్టు 8న జరిగే ఫైనల్‌లో ఆడతారు. క్వాలిఫికేషన్ రౌండ్‌లలో స్టార్ అట్రాక్షన్‌గా నీరజ్ ఉన్నాడు.
Also Read: Allu Arjun-Nani: బన్నీ, నాని మధ్య ఆసక్తికర సంభాషణ.. నెట్టింట వైరల్!
పారిస్ ఒలింపిక్స్ 2024లో నీరజ్ చోప్రా బంగారు పతకం సాధిస్తే.. చరిత్ర సృష్టిస్తాడు. భారత ఒలింపిక్ చరిత్రలో రెండు స్వర్ణ పతకాలు సాధించిన తొలి వ్యక్తిగత అథ్లెట్‌గా రికార్డుల్లో నిలుస్తాడు. ఒలింపిక్స్‌లో భారత్‌కు చెందిన ఏ అథ్లెట్ కూడా ఇప్పటి వరకు రెండుసార్లు బంగారు పతకం సాధించలేదు. జర్మనీకి చెందిన 19 ఏళ్ల మాక్స్ డెహ్నింగ్ నుంచి నీరజ్‌కు గట్టి పోటీ ఎదురుకానుంది. జర్మన్ వింటర్ త్రోయింగ్ ఛాంపియన్‌షిప్‌లో అతడు జావెలిన్‌ను ఏకంగా 90.20 మీటర్లు విసిరాడు.