Pallam Raju: రాహుల్ గాంధీ రెండో విడత భారత్ జోడో యాత్రపై సీడబ్ల్యూసీ సమావేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయినట్టు తెలిపారు కేంద్ర మాజీ మంత్రి, సీడబ్ల్యూసీ సభ్యులు పళ్లం రాజు.. ఢిల్లీలో సీడబ్ల్యూసీ సమావేశం నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా వివిధ అంశాలపై చర్చించింది.. ఆ తర్వాత ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన పళ్లం రాజు.. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలనే దృఢ సంకల్పాన్ని సమావేశంలో తీసుకున్నాం అన్నారు.. సీడబ్ల్యూసీ సమావేశంలో 143 మంది ఎంపీల సస్పెన్షన్ ఖండిస్తూ తీర్మానం చేసినట్టు పేర్కొన్న ఆయన.. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి కొంత నిరాశ కలిగించినా, కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం తగ్గకపోవడం కొంత ఊరట కలిగించిన అంశమని చర్చ జరిగిందన్నారు.
Read Also: Merugu Nagarjuna: వైఎస్ కుటుంబానికి మాత్రమే పాదయాత్రపై పేటెంట్..!
ఇక, తొలి విడత భారత్ జోడో యాత్ర విజయవంతంగా నిర్వహించిన రాహుల్ గాంధీ.. రెండో విడత పాదయాత్ర నిర్వహించాలని డిమాండ్ పార్టీలో ఉంది.. ఆ దిశగా రాహుల్ కూడా ఆలోచన చేస్తున్నారనే ప్రచారం సాగుతుండగా.. రెండో విడత రాహుల్ గాంధీ “భారత్ జోడో యాత్ర” పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయినట్టు పళ్లం రాజు తెలిపారు. మా అభిప్రాయాలను అధిష్టానానికి వివరించాం.. అంతిమంగా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. మరోవైపు.. ఇండియా భాగస్వామ్య పక్షాల నేతలతో సీట్ల సర్దుబాటు, పొత్తులపై ముకుల్ వాస్నిక్ కన్వీనర్ గా కాంగ్రెస్ పార్టీ నియామకం చేసిన ఐదుగురు నేతలతో కూడిన కమిటీ చర్చలు జరపుతుందని తెలిపారు కేంద్ర మాజీ మంత్రి, సీడబ్ల్యూసీ సభ్యులు పళ్లం రాజు.