Pakistan: దాయాది దేశమైన పాకిస్థాన్ ప్రజల జీవితంపై ఆర్థిక సంక్షోభం అధికంగా ప్రభావం చూపుతోంది. సంక్షోక్షం తలెత్తడంతో ఆ దేశ సర్కారు నిత్యావసర వస్తువులపై కోత పెడుతోంది. అప్పుల ఊబిలో చిక్కుకుపోయిన పాక్… తన ఖర్చులను తగ్గించుకునే పనిలో నిమగ్నమైంది. ద్రవ్యోల్బణం నుంచి బయటపడడానికి పొదుపు బాటను పట్టింది. ధరల పెరుగుదలతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ దుర్భర పరిస్థితుల్లో ధరల పెరుగుదల భారాన్ని తగ్గించుకునేందుకు ఆ దేశ ప్రజలు వంటగ్యాస్‌ను ప్లాస్టిక్ కవర్లలో నిల్వ చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
ఇంధన పొదుపు ప్రణాళిక అనే అంశంపై మంగళవారం పాక్ కేబినెట్ సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఇప్పటి నుంచి మార్కెట్లను రాత్రి 8.30గంటల వరకు, కళ్యాణ మండపాలను రాత్రి 10 గంటల వరకు మాత్రమే అనుమతించనున్నట్లు విలేకర్ల సమావేశంలో ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ వెల్లడించారు. దీనితో ఖజానాకు రూ.6వేల కోట్లు ఆదా అవుతాయన్నారు. ఫిలమెంట్ బల్బుల తయారీని ఫిబ్రవరి 1 నుంచి నిలిపివేయడం రూ.2,200 కోట్లు, గ్యాస్‌ను తక్కువగా వాడుకునే శంకువు ఆకారపు గీజర్ల వాడకాన్ని మాత్రమే అనుమతించడం ద్వారా రూ.9,200 కోట్లను ఆదా చేయనున్నామని చెప్పారు. పక్కపక్కనే ఉండే వీధి దీపాలను వెలిగించకపోతే రూ.400 కోట్లు మిగులుతాయని చెప్పారు.
Harassment: దేశం విడిచి వెళ్తే రూ.కోటి ఇస్తామంటున్నారు.. సిట్ దర్యాప్తుకు హాజరైన మహిళా కోచ్
దేశంలోని ప్రభుత్వ కార్యాలయల్లో పొదుపు నిబంధనలను పాటించాలని ఆయన వెల్లడించారు. దీనిలో భాగంగా వర్క్ ఫ్రమ్ హోం విధివిధానాలను 10 రోజుల్లో ప్రకటిస్తామని పేర్కొన్నారు. సమావేశాలను సూర్యకాంతి అందుబాటులో ఉన్నప్పుడే నిర్వహించుకోవాలని, ఈరోజు మంత్రివర్గ సమావేశం అలానే జరిగిందని తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి ఎలక్ట్రిక్ బైక్‌లను ప్రవేశపెడతామన్నారు. ఇదిలా ఉండగా.. ధరల భారాన్ని తగ్గించుకునేందుకు పాక్ ప్రజలు వంటగ్యాస్‌ను ప్లాస్టిక్ కవర్లలో నిల్వ చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ వీడియోను ఓ వ్యక్తి ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. ‘పాకిస్థాన్‌లో సిలిండర్లలో కాకుండా ప్లాస్టిక్ బ్యాగుల్లో వంట గ్యాస్ నింపుతున్నారు. గ్యాస్ పైపులన్ నెట్‌వర్క్‌తో అనుసంధానమైన దుకాణాల్లో ప్లాస్టిక్ బ్యాగుల్లో గ్యాస్ నింపుతున్నారు. చిన్న ఎలక్ట్రిక్ సక్షన్ పంప్ సాయంతో వీటిని వంట గదిలో వినియోగిస్తున్నారు.’అని రాసుకొచ్చారు.