ప్రభుత్వాాలు మారిన పాకిస్తాన్ భారత్ పై విషం చిమ్మడం మానదు. తన దేశాన్ని వెలగబెట్టలేదు కానీ అవకాశం వచ్చినప్పుడు కాశ్మీర్ ను రాజకీయం చేయాలని భావిస్తూనే ఉంది. ఇప్పటికే ఆర్థిక సమస్యలు, రాజకీయ సమస్యలతో సతమతం అవుతున్న పాకిస్తాన్, భారత్ కు నీతులు చెప్పడం విడ్డూరం. తన దేశంలో మైనారిటీలపై అఘాయిత్యాలు, హింస గురించి మాట్లాడదు కానీ కాశ్మీరి ప్రజల హక్కులను గురించి ప్రశ్నిస్తూ ఉంటుంది.
తాజాగా కొత్తగా ఎన్నికైన ప్రధాని షహబాజ్ షరీఫ్ మళ్లీ పాత పాటనే పాడుతున్నాడు. తొలిసారి పీఎంగా గద్దె ఎక్కిన తర్వాత పాక్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఆసియాలో ప్రశాంతకర, శాంతియుత పరిస్థితులు ఉండాలంటే భారత్ తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉందని అన్నారు. భారత్ జమ్మూ కాశ్మీర్ లో గత పరిస్థితులను పునరుద్ధరించాలని పిలుపునిచ్చారు. భారత ప్రభుత్వం రద్దు చేసిన ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలని పిలుపునిచ్చారు.
ఆసియాలో శాంతి నెలకొనాలంటే 2019, ఆగస్టు 5 నాడు భారత్ తీసుకున్న ఆర్టికల్ 370 ఎత్తివేత ఏకపక్ష నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాల్సిన బాధ్యత ఉందని అన్నారు. దీని ద్వారానే కాశ్మీర్ సమస్య చర్చల ద్వారానే పరిష్కారం అవుతుందని ఆయన అన్నారు. ఐక్యరాజ్య సమితి తీర్మాణాలకు అనుగుణంగా కశ్మీర్ సమస్యను పరిష్కరించుదాం అని ఆయన సూచించారు. చర్చల ద్వారానే ఇరు దేశాల్లో పేదరికాన్ని అంతం చేయగలుగుతామని ఆయన అన్నారు.
భారత్ కు నీతులు చెబుతున్న పాకిస్తాన్ లో పరిస్థితి గందరగోళంగా ఉంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు లగ్జరీ గూడ్స్ దిగుమతులపై కూడా బ్యాన్ విధించింది. తాజాగా పెట్రోల్ ధరలను 30 శాతం పెంచింది. కనీసం ఎన్నికలు నిర్వహించాలన్నా కూడా పాకిస్తాన్ ఖజానాలో చిల్లిగవ్వ లేని పరిస్థితి ఉంది. ఇక మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆజాద్ మార్చ్ పేరుతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు.