Commander Manoj Katiyar: పశ్చిమ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా తగ్గలేదని, పాకిస్థాన్ కావాలనే యుద్ధ వాతావరణాన్ని కొనసాగిస్తోందని వెస్ట్రన్ కమాండ్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కటియార్ తెలిపారు. శాంతి కోసం భారత్ ఎన్నిసార్లు ప్రయత్నించినా, పాకిస్థాన్ స్నేహబంధాలను కోరుకోవడం లేదని అన్నారు. ఢిల్లీలోని మానెక్షా సెంటర్‌లో జరిగిన వెస్ట్రన్ కమాండ్ ఇన్వెస్టిచర్ వేడుకలో ఆయన ప్రసంగించారు. పాకిస్థాన్ సైన్యానికి శాంతి అవసరం లేదని, శాంతి వస్తే తమ ప్రాధాన్యం తగ్గిపోతుందనే భయంతోనే ఉద్రిక్తతలను పెంచుతున్నారని కటియార్ వ్యాఖ్యానించారు. భారత్‌తో నేరుగా యుద్ధం చేసే ధైర్యం, సామర్థ్యం పాకిస్థాన్‌కు లేదని, అందుకే ప్రత్యక్ష యుద్ధం కాకుండా ప్రాక్సీ యుద్ధాలపై ఆధారపడుతోందని చెప్పారు.
READ MORE: Ananya Nagalla : టాలీవుడ్‌లో తెలుగు అమ్మాయిలను గుర్తించరు: అనన్య
పాకిస్థాన్‌కు ఉగ్రవాదమే ప్రధాన ఆయుధమని తీవ్రంగా విమర్శించారు. భారత్‌ను క్షీణింపజేయాలనే పాకిస్థాన్ అనుకుంటోంది. ఉగ్రదాడులు, కుట్రలే వారి వ్యూహంగా పెట్టుకుందని తెలిపారు. పహల్గాం వంటి ఉగ్ర ఘటనలు భారత్‌ను అస్థిరపరిచేందుకు పాకిస్థాన్ రూపొందించిన పథకాలలో భాగమేనన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో సైనికులు చూపిన అసాధారణ ధైర్యానికి అభినందనలు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో ఉగ్రవాద లాంచ్‌ప్యాడ్లు, శిబిరాలు, స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేశామని చెప్పారు. పాకిస్థాన్ ఈ దెబ్బ నుంచి అయినా పాఠం నేర్చుకుంటుందని ఆశిస్తున్నానని, అయితే నిర్లక్ష్యం చేయడానికి మాత్రం ఆస్కారం లేదని హెచ్చరించారు. భవిష్యత్తులో జరిగే ఏ ఘర్షణ అయినా పరిమితంగా ఉండకపోవచ్చని కటియార్ స్పష్టం చేశారు. ఈసారి యుద్ధం జరిగితే పాకిస్థాన్ తన దేశంలోని రాజకీయ, సైనిక సంక్షోభాల నుంచి దృష్టి మళ్లించేందుకు కొత్త సాహసాలకు పాల్పడే అవకాశం ఉందని చెప్పారు. భారత్‌ను మతాల పేరుతో విభజించాలన్నదీ శత్రువు కుట్రల్లో ఒకటని అన్నారు. పాకిస్థాన్ నాయకులు ఇంకా రెండు జాతుల సిద్ధాంతం భాషనే మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ కుట్రలను ఎదుర్కోవాలంటే అప్రమత్తతతో పాటు జాతీయ ఐక్యత అవసరమని ఆయన పిలుపునిచ్చారు.