మనదేశంలో తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా పండించే ఆహారపు పంటలల్లో వరి కూడా ఒకటి.. ప్రస్తుతం కొన్ని జిల్లాల్లో కోత దశలో ఉంది.. చలికాలం మంచు కారణంగా వరిపైరులో చీడపీడల ఉధృతి పెరిగింది. వీటిని సకాలంలో అరికట్టకపోతే తీవ్రనష్టం వాటిల్లే ప్రమాదముందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం..
నీటి వసతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా ఈ వరిని పండిస్తున్నారు.. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో దుబ్బు దశ నుండి కంకిపాలుపోసుకునే దశ వరకు ఉంది. ఇటు ఆంధ్రప్రదేశ్ లో పిలక దశనుండి పొట్టదశ వరకు ఉంది. మిశ్రమ వాతావరణ మార్పుల వలన వరిపైరులో కాండంతొలుచు పురుగు, ఆకుముడత పురుగు, సుడిదోమ, నల్లిజాతి పురుగుల ఉధృతి పెరిగింది.. తెగుళ్లు వాటి నివారణ చర్యలను ఇప్పుడు చూద్దాం..
ఉల్లికోడు..
పిల్ల పురుగులు కాండాన్ని తొలిచి ఆంకురం వద్ద వృద్ధి చెందుతుంది. తర్వాత అంకురం లేత ఆకుపచ్చని పొడగాటి గొట్టంగా మార్పుచెంది బయటకు వస్తుంది. ఆలస్యంగా నాటిన పొలాల్లో ఈ ఉధృతి ఎక్కువగా ఉంటుంది.
నివారణ..
ఉల్లి గొట్టాలు కనిపిస్త్తే కార్భొఫ్యూరాన్ 3జీ గుళికలు ఎకరాకు 10 కిలోలు లేదా, ఫోరెట్ 10జీ గుళికలు ఎకరాకు 5కిలోలు వెదజల్లాలి..
బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు..
వర్షపాతం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉధృతి పెరుగుతుంది. తెగులు సోకిన ఆకులపై పసుపురంగు మచ్చలు ఏర్పడి దుబ్బుకు ఇరుపక్కలా ఆకులు ఎండి పోతాయి
నివారణ..
అగ్రిమైసిన్ లేదా ప్లాంటామైసిన్ 80 గ్రాములు 200 లీటర్ల నీటిలో లేదా 30గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ 10లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి..
కాండం తొలిచే పురుగు..
పిలకలు తొడిగే దశలో ఈ పురుగు ఆశించిన మొవ్వులు ఎండి చనిపోతాయి. పూత దశ తర్వాత ఆశిస్తే వెన్నులు తెల్ల కంకులుగా మారుతాయి. చచ్చిన మొవ్వులు/కంకులు పీకితే తేలికగా బయటకు వస్తాయి.
నివారణ..
ఆలస్యంగా వరి నాట్లు పడితే పైరుకు 30 రోజుల్లోపు ఎకరాకు కార్బొఫ్యూరాన్ 3జీ గుళికలు 10కిలోలు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4జి గుళికలు 8కిలోల మిశ్రమాన్ని పొలంలో నీరు తగ్గించి చల్లాలి. లేదా క్లోరాంటోనిలీఫ్రోల్ 4కిలోలు చల్లాలి. ఇక రెక్కల పురుగు ఉధృతి గమనిస్తే కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్‌ను 50శాతం, ఎస్పీ 400 గ్రాములు లేదా క్లోరాంటోనీలిప్రోల్ 60 మిల్లీ లీటర్లు ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి మొక్కలు బాగా తడిచేలా పిచికారీ చేయాలి.. ఇవే కాదు ఇంకా చాలా రకాల తెగుళ్లు ఉన్నాయి.. పంటను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నివారణ చేపట్టాలని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు..