P Chidambaram React on Congress to lose in the Assembly Elections: ఇటీవల ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతుందని తాము ఊహించలేదని ఆ పార్టీ సీనియర్ నేత పి చిదంబరం అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో విజయం సాధించడం బీజేపీలో ఉత్సాహం నింపిందన్నారు. మూడు రాష్ట్రాలతో పాటు తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు మాత్రం చెక్కుచెదరలేదని చిదంబరం పేర్కొన్నారు. ప్రతి ఎన్నికనూ తుది సమరం వలే భావిస్తూ బీజేపీ పోరాడుతోందని, ఈ విషయాన్ని విపక్షాలు గ్రహించాలని ఆయన సూచించారు.
పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పి చిదంబరం మాట్లాడుతూ… ‘2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో విజయం సాధించడం బీజేపీలో ఉత్సాహం నింపింది. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో పరాజయం మాత్రం కాంగ్రెస్ ఊహించలేదు. ఇది పార్టీకి ఆందోళన కలిగించే అంశం. ఈ బలహీనతను అగ్రనాయకత్వం పరిష్కరిస్తుంది. అయితే ఈ మూడు రాష్ట్రాలతో పాటు తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు మాత్రం చెక్కుచెదరలేదు. వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి 45 శాతానికి ఓటు బ్యాంకు పెరుగుతుంది’ అని ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read: ENG vs IND: పెద్దక్కలాంటి మంధాన నుంచి క్యాప్‌ను అందుకోవడం కెరీర్‌లోనే స్పెషల్!
డిసెంబర్ 21న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కానుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది. ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ప్రతికూల ఫలితాలతో పాటు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై చర్చించనున్నట్లు సమాచారం. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనే అంశంపై కూడా చర్చ జరగనుంది.