Site icon NTV Telugu

Operation Sindoor : భారత దాడిలో జైషే టాప్ కమాండర్ హతం..!

Jaishe Mohmmed

Jaishe Mohmmed

Operation Sindoor : పహల్గాంలో జరిగిన దారుణమైన ఉగ్రదాడి ఇంకా మన కళ్లముందు మెదులుతూనే ఉంది. భార్యల కళ్లెదుటే భర్తలను పొట్టన పెట్టుకున్న ఆ దుర్మార్గుల చర్య యావత్ భారతావనిని కలచివేసింది. అయితే, ఇప్పుడు ఆ బాధకు ప్రతిస్పందనగా భారత్ గర్జించింది. పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి ఉగ్రమూకల స్థావరాలపై పిడుగులా విరుచుకుపడింది. భారత సైన్యం పాకిస్తాన్ , పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఏకంగా తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని ఈ మెరుపు దాడులు జరిగాయి.

ఈ దెబ్బతో ఉగ్రవాదుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అనడంలో సందేహం లేదు. అయితే, అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఒక్కటే – ఈ దాడిలో భారత దేశానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఉగ్రనేతలు హఫీజ్ సయీద్ , మసూద్ అజహర్ హతమయ్యారా?

మసూద్ అజహర్, హఫీజ్ సయీద్ హతమయ్యారా?
భారతదేశం మసూద్ అజహర్ ముఖ్య స్థావరమైన బహవల్‌పూర్‌ను లక్ష్యంగా చేసుకుంది. ఈ స్ట్రైక్‌లో వారి ప్రధాన కార్యాలయం , మదర్సా నేలమట్టం అయ్యాయి. పాకిస్తాన్ మీడియా స్వయంగా ఈ విషయాన్ని ధృవీకరించింది. ఈ దాడిలో జైష్-ఎ-మహ్మద్‌కు చెందిన దాదాపు 50 మంది ఉగ్రవాదులు హతమయ్యారని తెలుస్తోంది.

అంతేకాకుండా, మురీద్కేలోని లష్కర్-ఎ-తైబా స్థావరాన్ని కూడా భారత్ ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో లష్కర్ , జైష్‌కు చెందిన పలువురు టాప్ కమాండర్లు హతమయ్యారు. అయితే, ఈ దాడుల్లో మసూద్ అజహర్ , హఫీజ్ సయీద్ మరణించినట్లు అధికారిక సమాచారం ఇంకా వెలువడలేదు.

భారతదేశం చేసిన ఈ దాడుల అనంతరం పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ దాడిని ఆయన స్వయంగా ధృవీకరించారు. “భారత్ మాపై యుద్ధం ప్రకటించింది. మాకు తిప్పికొట్టే హక్కు ఉంది” అని ఆయన వ్యాఖ్యానించారు.

భారత సైన్యం మెరుపువేగంతో విరుచుకుపడిన ప్రాంతాలివే:

ముజఫరాబాద్‌లో 2 స్ట్రైక్‌లు, బహవల్‌పూర్‌లో 3వ స్ట్రైక్, కోట్లీలో 4వ , చాక్ అమ్రూలో 5వ దాడి, గుల్‌పూర్‌లో 6వ , భింబర్‌లో 7వ దాడి, మురీద్కేలో 8వ, సియాల్‌కోట్‌లో 9వ దాడి.

 

Exit mobile version