శంషాబాద్ ఎయిర్‌పోర్టు రన్‌వేపై చిరుత కలకలం సృష్టించింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఎయిర్‌పోర్టు పరిసరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. చిరుతను బంధించేందుకు మొత్తం 9 ట్రాప్ కెమెరాలతో పాటుగా ఒక బోన్‌ను సైతం ఏర్పాటు చేశారు. అయితే ఆ ట్రాప్ కెమెరాల్లో సైతం చిరుత కదలికలు స్పష్టంగా రికార్ట్ అయ్యాయి. అదే చిరుత రన్‌వే పైకి వచ్చిందని జిల్లా అటవీ శాఖ అధికారి విజయానంద్ తెలిపారు. కొన్ని నెలల క్రితం షాద్‌నగర్ ప్రాంతంలోనూ చిరుత కనిపించింది. ఇప్పుడే అదే చిరుత ఎయిర్‌పోర్టు పరిసరాలకు వచ్చి ఉంటుందని ఎయిర్ పోర్టు అధికారులు భావిస్తు న్నారు. చిరుతను బంధిం చేందుకు అందులో ఓ మేకను సైతం ఎరగా ఉంచినట్లుగా డీఎఫ్‌వో విజయానంద్ వెల్లడిం చారు…
ఎయిర్ పోర్ట్ తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లి వద్ద చిరుత ఎయిర్ పోర్ట్ ప్రహరీ నుండి దూకడం.. చిరుతతో పాటు రెండు చిరుత పిల్లలు కూడా సంచరిస్తున్నట్లు ఎయిర్పోర్ట్ అధికారులు గుర్తించారు. ఎయిర్ పోర్ట్ ప్రహరీ దూకుతుండగా ఫెన్సింగ్ వైర్లకు చిరుత తగలడంతో ఎయిర్ పోర్ట్ కంట్రోల్ రూమ్ లో అలారం మోగడంతో.. కంట్రోల్ రూమ్ సెక్యూరిటీ అధికారులు అప్రమత్తమయ్యారు. సీసీ కెమెరాలను పరిశీలించడంతో చిరుత సంచరించినట్లు గుర్తించారు. చిరుతతో పాటు రెండు చిరుత పిల్లలు ఉన్నట్లు కెమెరాలో రికార్డు అయ్యింది. అటవిశాఖ అధికారులకు సమాచారం అందించడంతో ఎయిర్ పోర్ట్ లోకి చేరుకున్న అటవిశాఖ అధికారులు చిరుతను బంధించేందుకు ఏర్పాటులో పడ్డారు.