కేరళ మాజీ సీఎం, కాంగ్రెస్ దిగ్గజ నేత ఊమెన్ చాందీ కన్నుమూశారు. ఆయన వయసు 79 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఊమెన్ చాందీ బెంగళూరులో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు చాందీ ఊమెన్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. 1943 అక్టోబర్ 31న ఊమెన్ చాందీ కొట్టాయం జిల్లా పుతుప్పల్లిలో జన్మించారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన ఊమెన్ చాందీ.. రెండుసార్లు కేరళకు సీఎంగా పని చేశారు. గత ఏడాది కాలంగా ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆయన బెంగళూరులోని ఓ ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఊమెన్ చాందీ పార్థీవ దేహాన్ని తిరువనంతపురంకు ప్రజా సందర్శనార్థం తరలించారు. ఆయన స్వస్థలం కొట్టాయంలోనే అంత్యక్రియలు జరగనున్నట్లు సమాచారం తెలుస్తోంది. కేరళ మాజీ సీఎం మృతిపట్ల పలువురు సంతాపం ప్రకటిస్తున్నారు.
Also Read: Gold Price Today: బంగారం ప్రియులకు శుభవార్త.. తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?
కేరళ మాజీ ముఖ్యమంత్రి మృతిపట్ల కేరళ కాంగ్రెస్ అధ్యక్షుడు కె సుధాకరన్ సంతాపం తెలిపారు. ‘ప్రేమతో ప్రపంచాన్ని గెలిచిన రాజు కథ ముగుసింది. లెజెండ్ ఊమెన్ చాందీని కోల్పోయినందుకు నేను ఈరోజు చాలా బాధపడ్డాను. ఆయన అసంఖ్యాక వ్యక్తుల జీవితాలను మరియు అతని వారసత్వాన్ని ప్రభావితం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని సుధాకరన్ ట్వీట్ చేశారు. ఇక కాంగ్రెస్ అగ్రనేతలు అంత్యక్రియలకు హాజరయ్యే అవకాశాలూ ఉన్నాయి.
సాధారణ కార్యకర్తగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఊమెన్ చాందీ అత్యున్నత స్థానాలకు చేరుకున్నారు. 27 ఏళ్ల వయసులో పూతుపల్లి నుంచి 1970లో తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించారు. పూతుపల్లి నియోజకవర్గం నుంచి ఏకంగా 12 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1977లో కె.కరుణాకరన్ కేబినెట్‌లో తొలిసారిగా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇక రెండుసార్లు (2004- 2006, 2011- 2016) సీఎంగా పని చేశారు. ఐదు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉన్న ఊమెన్ చాందీ ఏనాడూ పార్టీ మారలేదు.