దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని మోడీ ప్రభుత్వం భావించింది. ఈసారే నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. కానీ సాధ్యం కాలేదు. అసలు జమిలి ఎన్నికలు సాధ్యమా? కాదా? అన్నది తెలుసుకునేందుకు మాజీ రాష్ట్రపతి కోవింద్ ఆధ్వర్యంలో కమిటీ అధ్యయనం చేస్తోంది.
ఇక తాజాగా వన్ నేషన్-వన్ ఎలక్షన్‌పై లా కమిషన్ స్పందించింది. ప్రస్తుతానికి జమిలి సాధ్యం కాదని పేర్కొంది. లా కమిషన్ (Law Commission) చైర్మన్ జస్టిస్ రీతూరాజ్ ఆవస్తి నేతృత్వంలో ఏర్పాటైంది. గతేడాది సెప్టెంబర్ 27న ఢిల్లీ వేదికగా జరిగిన లా కమిషన్ సమావేశంలో జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై చర్చించారు.
తాజాగా లా కమిషన్ నుంచి ఒక కీలక ప్రకటన వచ్చింది. 2029 లోక్‌సభ ఎన్నికల నాటికి జమిలి ఎన్నికలు అమల్లోకి తీసుకొచ్చే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు జరిగే అవకాశముందని లా కమిషన్ పేర్కొన్నట్లు సమాచారం.
అయితే రాజ్యాంగంలో కొన్ని సవరణలు చేయాల్సిన అవసరముందని ప్రతిపాదించింది. రాజ్యాంగంలో కొత్తగా ‘Simultaneous election’ అనే సెక్షన్ చేర్చాలని ప్రతిపాదించింది. ఇలా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ఎన్నేళ్ల పాటు కొనసాగించవచ్చన్న అంశం కూడా అందులో చేర్చాల్సిన అవసరముందని స్పష్టం చేసింది. అసెంబ్లీలు, పంచాయతీలు, మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించవచ్చని వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న నిబంధనలను పాటిస్తూనే… కొత్తగా మార్పులు ఎలా చేయొచ్చో ఆలోచించాలని తెలిపింది.
సాధారణంగా అసెంబ్లీ గడువు ఐదేళ్ల వరకూ ఉంటుంది. అయితే…మూడు లేదా ఆరు నెలల లోపు గడువు ముగిసే రాష్ట్రాలను ముందుగా పరిగణనలోకి తీసుకుని అక్కడ తొలి విడతలో ఎన్నికలు నిర్వహించాలని లా కమిషన్ ప్రతిపాదించింది. ఈ లోగా ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం కారణంగా కుప్ప కూలినా…ఒకవేళ హంగ్ ఏర్పడినా ఆ సమయంలో unity government ని ఏర్పాటు చేయాలని తెలిపింది. అన్ని రాజకీయ పార్టీల నుంచి ప్రతినిధులను ఎంపిక చేసుకుని ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది. ఒకవేళ unity government ఆలోచన సక్సెస్ కాకపోతే…వెంటనే ఎన్నికలు నిర్వహించాలని లా కమిషన్ స్పష్టం చేసింది.
ఇదిలా ఉంటే మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ కూడా పర్యవేక్షిస్తోంది. ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం సాధ్యమేనా? కాదా? అన్న విషయాన్ని ఈ కమిటీ మేధోమథనం చేస్తోంది. వచ్చే ఏడాది మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బిహార్, ఢిల్లీలో వచ్చే ఏడాది, 2026లో అసోం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో ఎన్నికలు జరగనున్నాయి. 2027లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్ ఎన్నికలకు వెళ్తాయి. లా కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.