Medical Negligence: వైద్యుడిని దేవుడితో పోలుస్తాం. దేవుడు ప్రాణం పోస్తే డాక్టర్ ఆ ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా కాపాడతాడు. అందుకే సమాజంలో వైద్యులకు విశేష ప్రాధాన్యత కట్టబెట్టారు. కానీ కొందరి తీరు వల్ల డాక్టర్లకూ చెడ్డ పేరు వస్తోంది. విధుల్లో నిర్లక్ష్యంగా ఉండటం, రోగుల పట్ల సరిగ్గా వ్యవహరించకపోవడం వంటివి చేస్తూ వైద్య వృత్తికే కళంకం తీసుకొస్తుంటారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. ప్రైవేట్ వైద్యుడి నిర్వాకం వల్ల నెల రోజుల వయస్సు గల ఓ బాలుడి ప్రాణం పోయింది.
Also Read: Uttar Pradesh: రూ.50 కోసం కొట్లాట.. కర్రలతో పుర్రెలు పలిగేట్లుగా..
బొడ్డు కింద చీము వస్తుందని చికిత్స కోసం నెల వయస్సు గల బాలుడిని పెద్దకడుబూరు మండలం కంపాడు వాసులు ఎమ్మిగనూరులోని ఓ ప్రైవేట్ దవాఖానాకు తీసుకొచ్చారు. ఆ ఆస్పత్రిలోని వైద్యుడు నిర్లక్ష్యంగా బొడ్డు కింద కోసేయడంతో బాలుడి పేగులు బయటపడ్డాయి. ఆ వైద్యుడు పేగులను కడుపులో వేసి ప్లాస్టర్ వేశాడు. ఈ క్రమంలో బాలుడిని అర్జెంట్‌గా కర్నూలుకు తీసుకుపోవాలని ఆ వైద్యుడు చెప్పాడు. కర్నూలులోని ఆస్పత్రికి బాలుడి కుటుంబసభ్యులు తరలించారు. అక్కడి వైద్యులు బాలుడిని పరిశీలించి అప్పటికే ప్రాణాలు విడిచాడని తెలిపారు. దీంతో ఆ బాలుడి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వైద్యుడి నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు ప్రాణాలు విడిచాడని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం మృతదేహాన్ని దేవనకొండ మండలం కొత్తపేటకు తరలించారు.