Omar Abdulla : జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)పై తీవ్ర విమర్శలు గుప్పించారు. “భారత సరిహద్దులపై పాకిస్తాన్ షెల్లింగ్ చేయడానికి IMF డబ్బులు తిరిగి చెల్లిస్తోందా?” అంటూ ఆయన నిప్పులు చెరిగారు. సోషల్ మీడియా వేదిక X (ట్విట్టర్)లో ఒమర్ అబ్దుల్లా చేసిన పోస్ట్ సంచలనం రేపింది. పాకిస్తాన్‌కు అంతర్జాతీయ సంస్థలు ఆర్థిక సహాయం అందిస్తూ, అదే సమయంలో ఈ ప్రాంతంలో శాంతిని ఎలా ఆశిస్తున్నాయని ఆయన నిలదీశారు. “పూంచ్, రాజౌరి, ఉరి, తంగ్‌ధర్ , మరెన్నో ప్రాంతాలను నాశనం చేయడానికి పాకిస్తాన్ ఉపయోగిస్తున్న మందుగుండు సామగ్రి ఖర్చులను IMF తిరిగి చెల్లిస్తున్నప్పుడు, ఉపఖండంలో ప్రస్తుత ఉద్రిక్తతలను ఎలా తగ్గించవచ్చని ‘అంతర్జాతీయ సమాజం’ భావిస్తుందో నాకు అర్థం కావడం లేదు” అని ఒమర్ అబ్దుల్లా తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
Indian Official Killed: పాక్ దాడుల్లో రాజౌరి అడిషనల్ డిప్యూటీ కమిషనర్ మృతి.. స్పందించిన సీఎం ఒమర్!
సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ చేస్తున్న దాడులకు IMF నుండి అందుతున్న నిధులు ఎలా ఉపయోగపడుతున్నాయో ఆయన ప్రశ్నించారు. ఈ నిధులు పాకిస్తాన్ సైనిక చర్యలకు ఊతమిస్తున్నాయని, తద్వారా ప్రాంతీయ శాంతికి విఘాతం కలిగిస్తున్నాయని ఆయన వాదించారు. ఒమర్ అబ్దుల్లా చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ సమాజంలో చర్చనీయాంశంగా మారాయి. IMF నిధులపై ఆయన చేసిన ఆరోపణలు ప్రాంతీయ భద్రత, అంతర్జాతీయ ఆర్థిక సహాయం , సరిహద్దు ఉద్రిక్తతల మధ్య సంక్లిష్ట సంబంధాన్ని వెలుగులోకి తెచ్చాయి.
ఈ ఆరోపణలపై IMF నుండి ఇంకా ఎటువంటి స్పందన రాలేదు. అయితే, ఈ అంశంపై అంతర్జాతీయ సమాజం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఒమర్ అబ్దుల్లా చేసిన ఈ వ్యాఖ్యలు సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పడానికి అంతర్జాతీయ సంస్థలు , దేశాలు అనుసరించాల్సిన విధానాలపై తీవ్ర చర్చకు దారితీసే అవకాశం ఉంది.