పవన్‌కళ్యాణ్ విషయంలో చాలా ఎక్కువ చేశామని వైసీపీ ఫీలవుతోందా? దీన్ని ఇంకా సాగదీస్తే… ఓ వర్గం కంప్లీట్‌గా దూరమవుతుందన్న భయం పార్టీలో పెరిగిపోతోందా? అందుకే అదుపు… అదుపు… మాట పొదుపు అన్న వార్నింగ్స్ వెళ్తున్నాయా? ఆయన్ని చీల్చి చెండాడేద్దామని అనుకుంటే… మనకింకా చీరుకుపోయేట్టుందని ప్రతిపక్ష నేతలు భావిస్తున్నారా? అసలు పవన్ గురించి వైసీపీలో మొదలైన కొత్త చర్చ ఏంటి? పార్టీ ముఖ్యుల అభిప్రాయం ఎలా ఉంది? ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ విషయంలో వైసీపీ వైఖరి ఇన్నాళ్ళు ఒక ఎత్తు, ఇక నుంచి మరో ఎత్తు అన్నట్టుగా ఉండబోతోందా? అంటే… అవుననే అంటున్నాయట ఆ పార్టీ వర్గాలు. ఆ విషయమై అంతర్గతంగా గట్టి చర్చే జరుగుతున్నట్టు చెప్పుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కంటే ఎక్కువగా… వైసీపీ లీడర్స్ పవన్ కళ్యాణ్‌నే టార్గెట్ చేశారన్నది రాజకీయ వర్గాల విస్తృతాభిప్రాయం. పవన్ ప్యాకేజీ స్టార్ అంటూ కొందరు, ఆయన పెళ్ళిళ్ళు, వ్యక్తిగత జీవితం గురించి మరికొందరు వైసీపీ లీడర్స్ నోటికి అడ్డు అదుపూ లేకుండా మాట్లాడేవాళ్ళు అప్పట్లో. వాళ్ళు, వీళ్ళు అని లేకుండా టాప్ టు బాటమ్ పవన్ టార్గెట్‌గా చెలరేగిపోయి సామాజికంగా వాడకూడని పదాలను సైతం వాడేశారు. అయితే… జనసేన అధ్యక్షుడి వ్యక్తిత్వ హననం ద్వారా కాపుల్లో చీలిక తెచ్చి లబ్ది పొందాలనుకున్న వైసీపీ ప్లాన్ బెడిసి కొట్టి బూమరాంగ్ అయిందన్నది తాజా విశ్లేషణగా తెలుస్తోంది. ఎన్నికల ఫలితాల పోస్ట్‌మార్టంలో ఎక్కువ మంది వైసీపీ పెద్దలు ఈ పాయింట్ లేవనెత్తారని, మనం అన్న మాటలు, చేసిన ప్రచారంతో కాపుల్లో పవన్ అంటే వ్యతిరేకత పెరక్కపోగా… గతంలో ఎన్నడూ లేనంత ఐక్యత వచ్చి ఓట్లు సాలిడ్ అయ్యాయని చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది.ఇంకా అదే ధోరణితో ముందుకు వెళ్తే కాపులు వైసీపీకి శాశ్వతంగా దూరమవుతారన్న హెచ్చరికలతో అధిష్టానం నష్ట నివారణ చర్యలు మొదలు పెట్టినట్టు చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు. 2019లో తాము అధికారంలోకి రావడానికి కాపుల ఓట్లు కూడా కీలకంగా పనిచేశాయన్న విషయాన్ని అంతర్గత చర్చల్లో ప్రస్తావిస్తున్నారట వైసీపీ నేతలు.
అంతటి బలమైన ఓట్ బ్యాంక్‌ని కేవలం పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేయడం ద్వారా దూరం చేసుకున్నామన్న చర్చ ప్రతిపక్ష పార్టీలో జరుగుతోందని అంటున్నారు. అందుకే ఇక నుంచి పవన్ జోలికి వెళ్లకుండా, ఒకవేళ వెళ్లాల్సి వచ్చినప్పుడు కూడా సాఫ్ట్‌గా రాజకీయం చేద్దామన్న ప్రతిపాదనలు వచ్చినట్టు పార్టీలో టాక్ నడుస్తోంది. పవన్ కళ్యాణ్ జోలికి వెళ్ళ వద్దని ఎన్నికల ప్రచారం టైంలోనే… వైసీపీలోని కాపు మంత్రులకు ఆ సామాజికవర్గ పెద్దలు చెప్పారని, కానీ… ఆ టైంలో వాళ్ళు ఆ విషయాన్ని జగన్‌కు చెప్పే సాహసం చేయలేకపోయారని, ఈలోపు జరక్కూడని నష్టం జరిగిపోయిందని ఇప్పుడు మాట్లాడుకుంటున్నారట వైసీపీలో. అదే సమయంలో ఫలితాల తర్వాత పవన్ విషయంలో జగన్ వైఖరి కూడా కొంత మారిందని విశ్లేషిస్తున్నారు కొందరు. ఇటీవల వరద బాధితుల పరామర్శకు జగన్ నేరుగా పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకోవడంతో….టార్గెట్ మారలేదని, ఏదో జరగబోతోందని ఊహించుకున్నారు ఎక్కువ మంది. కానీ… అంచనాలకు భిన్నంగా… పిఠాపురం టూర్‌లో ఎక్కడా పవన్‌ను నేరుగా విమర్శించకుండా సీఎం చంద్రబాబుని టార్గెట్ చేయడమే మారిన జగన్ వైఖరికి నిదర్శనం అంటున్నారు పరిశీలకులు. పైగా… పవన్ కళ్యాణ్‌కు ఏమీ తెలియదని, ఆయన సినిమాల్లో నటిస్తే చంద్రబాబు బయట అంతకుమించి నటిస్తున్నారన్న కామెంట్స్‌తో తన వైఖరేంటో వైసీపీ అధ్యక్షుడు చెప్పకనే చెప్పేశారని అంటున్నారు. ఎన్నికల ముందు వైసిపి నుంచి కొందరు నాయకులు జనసేనలోకి వెళ్ళగా…. ఇప్పుడా వలసలు ఎక్కువయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జగన్ బంధువు, ఇన్నాళ్ళు పార్టీ సీనియర్ నేతగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి వైఖరిని ఉదహరిస్తున్నారు. అలాగే మరోనేత సామినేని ఉదయభాను కూడా వైసీపీని వీడి జనసేనలో చేరతారన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో… డిప్యూటీ సీఎం విషయంలో గతంలో మాదిరి కాకుండా ఆచితూచి వ్యవహరించాలన్న చర్చ గట్టిగానే జరుగుతోందట వైసీపీలో. ఇది ఏ మేరకు అమలవుతుందో… ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి మరి.