వెన్నుపోటు దినం ర్యాలీలు వైసీపీకి మాంఛి కిక్కు ఇచ్చాయా? ఆ ప్రోగ్రామ్ సూపర్ సక్సెస్ అని పార్టీ అధిష్టానం భావిస్తోందా? అందుకే సీక్వెల్‌ను సిద్ధం చేస్తోందా? ఏంటా కొనసాగింపు కార్యక్రమాలు? పార్టీ అధిష్టామం మనసులో ఏముంది? ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి.. ఏడాది పూర్తయినా ఎన్నికల హామీలను మాత్రం అమలు చేయలేదంటూ ఆందోళన బాట పట్టింది వైసీపీ. ఫలితాలు వెలువడ్డ జూన్ 4న వెన్నుపోటు దినం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. నాడు సూపర్ సిక్స్ సహా మొత్తం 143 హామీలు ఇచ్చి.. గెలిచాక అన్నిటినీ అటకెక్కించారని ఆరోపిస్తున్న వైసీపీ….అన్ని నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించి నిరసన తెలిపింది. ఒకటి, రెండు చోట్ల చిన్న చిన్న ఘటనలు మినహా… మిగతా అన్ని ప్రాంతాల్లో వెన్నుపోటు దినం ప్రోగ్రామ్స్ సక్సెస్ అయ్యాయని, ప్రజల స్పందన కూడా బాగుందన్న ఫీడ్ బ్యాక్ వచ్చిందట వైసీపీ హెడ్డాఫీస్‌కు. కొన్నిచోట్ల పోలీసులు పార్టీ నేతలను బయటకు రానివ్వకపోయినా… అక్కడ కూడా మైలేజ్ తెచ్చుకునేందుకు వేసిన ప్లాన్స్ బాగా అమలైనట్టు భావిస్తున్నారట పార్టీ పెద్దలు. దీంతో…. ఇదే ఊపులో… ఇలాగే టెంపో మెయిన్‌టెయిన్ చేయాలనుకుంటున్నట్టు సమాచారం. హిట్ సినిమాకు సీక్వెల్ తీసినట్టే…… ఇక్కడ కూడా వెన్నుపోటు దినం ప్రోగ్రామ్‌కు కొనసాగింపునివ్వాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక నుంచి అన్ని జిల్లాల్లో పార్టీ నాయకుల్ని యాక్టివ్ మోడ్‌లో ఉంటడం, ఈ ఊపు తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవడంపై దృష్టి సారించిందట వైసీపీ అధిష్టానం. అనుకున్నది అనుకున్నట్టుగా… పూర్తి స్థాయిలో అమలు చేయగలిగితే… పార్టీ కేడర్ రీ ఛార్జ్ అవడంతో పాటు కూటమి ప్రభుత్వ వైఫల్యాల గురించి ప్రజల్లో చర్చకు పెట్టవచ్చన్నది ఫ్యాన్ పెద్దల ప్లాన్ అట. అలా ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టాలనుకుంటున్నారన్నది వైసీపీ ఇంటర్నల్ టాక్. మొత్తంగా వెన్నుపోటు దినం ర్యాలీలు సక్సెస్ అయినట్టు పార్టీ పెద్దలు భావిస్తున్న క్రమంలో…. మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ నెలాఖరులోగా 13 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.
కూటమి పాలన ఏడాది వైఫల్యాలు.. జగన్ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన వివిధ కార్యక్రమాలను నిర్వీర్యం చేసిన విధానంపై వివిధ రంగాల ప్రముఖులతో ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తారట. ఇందులో కీలక రంగాలకు సంబంధించి నిపుణులకు కూడా భాగస్వామ్యం కల్పించాలనుకుంటున్నట్టు సమాచారం. జగన్ హయాంలో ఉన్న పథకాలు, వివిధ రంగాల వారీగా వాటిని ప్రస్తుత ప్రభుత్వం ఎలా నిర్వీర్యం చేస్తోందన్న అంశాలపై పూర్తి అధ్యయనం చేయాలని కీలక నేతలకు సూచించినట్టు తెలిసింది. ప్రభుత్వ వైఫల్యాలపై స్పష్టంగా చర్చ జరిపి ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్ళాలనుకుంటున్నారట వైసీపీ పెద్దలు. విద్యార్ధులు, మహిళలు, యువత, రైతులు… ఇలా ప్రతి వర్గానికి కూటమి ఏం చెప్పింది.. ఏం చేయలేదనే అంశాలపై ఈ రౌండ్ టేబుల్ సమావేశాల ద్వారా ప్రజల్లో చర్చకు పెట్టాలని భావిస్తోందట ప్రతిపక్షం. రెడ్ బుక్ పేరుతో అరాచకంగా వ్యవహరిస్తున్నారంటూ ఇప్పటికే ఆరోపిస్తున్నారు వైసీపీ నాయకులు. 13 ఉమ్మడి జిల్లాల రౌండ్ టేబుల్ సమావేశాల్లో దీని మీద కూడా ఎక్కువ చర్చ జరిగి అది జనంలోకి వెళ్ళేలా చేయాలనుకుంటున్నట్టు సమాచారం. ఆయా రంగాల్లోని నిష్ణాతులు, మేధావులు, సివిల్ సొసైటీ సభ్యులు, రిటైరైన అధికారులు, రిటైర్డ్ ప్రొఫెసర్లు, సోషల్ వర్కర్స్, రైతు సంఘాల నేతలు, అనుభవమన్న తటస్ధులందరినీ ఇందులో భాగస్వాముల్ని చేసేలా క్లియర్ కట్ ప్రణాళిక సిద్ధమైందట. రెగ్యులర్‌గా ఏదో ఒక నిరసన కార్యక్రమాన్ని ప్లాన్ చేయటం.. దాన్ని సక్సెస్ చేయటం.. తిరిగి మరో టాపిక్ ఎత్తుకుని ఊపు కొనసాగించడం… ఇలా సీక్వెల్‌గా నిర్వహిస్తే… ప్రజలను బాగా కనెక్ట్ చేయవచ్చని లెక్కలు వేస్తోందట వైసీపీ అధిష్టానం. సినిమాల్లో సక్సెస్ అయిన సీక్వెల్ ఫార్ములా పాలిటిక్స్‌లో ఎంత వరకు వర్కౌట్ అవుతుందో…. వైసీపీ లెక్కలు.. వ్యూహాలు ఏ మేరకు జనంలోకి వెళ్తాయో చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.