వైసీపీ అధినేత జగన్‌కు తత్వం పూర్తిగా బోధపడిందా? పార్టీ హైకమాండ్‌కు రియాలిటీ ఏంటో తెలిసి వచ్చిందా? నిన్నటి ఎంపీపీ ఎన్నికలతో బొమ్మ క్లియరైందా? మన వాళ్ళు ఎవరు? కాని వాళ్ళు ఎవరన్న సంగతి జగన్‌కు తెలిసివచ్చిందా? ఇంతకీ ఏం జరిగింది? ఏ విషయంలో పిక్చర్ క్లియరైంది? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏపీ గ్రామీణ ప్రాంతాల్లో గట్టి పట్టు ఉంది.చిన్న చితకా పార్టీ కార్యక్రమాలైతే… ముఖ్య నేతలతో సంబంధం లేకుండా స్థానిక నాయకులు చేసుకుపోతుంటారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాలంటీర్ వ్యవస్థవల్ల గ్రామ స్థాయిలో పార్టీకి గట్టి దెబ్బే తగిలిందని ఎన్నికల ఫలితాల తర్వాత పోస్ట్‌మార్టంలో తేలిందట. ఈ విషయాన్ని గ్రహించే….ఇటీవల 2.0 గురించి ప్రస్తావించారు జగన్. 2.0లో క్యాడర్ కు మంచి ప్రాధాన్యత ఇస్తామని, ఏం చేస్తానో మీరే చూస్తారంటూ భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారాయన. ఇక ఆ తర్వాతి నుంచి కేడర్ రీ ఛార్జ్ అయినట్టు కనిపిస్తోందని అంటున్నారు. దీంతో అంతకు ముందు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఉప ఎన్నికల్లో డీలా పడ్డా… ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికకు వచ్చే సమయానికి సీన్ మొత్తం మారిపోయింది. మెజారిటీ స్థానాల్లో పై స్థాయి నాయకులతో సంబంధం లేకుండా క్రిందిస్దాయి నేతలే గట్టిగా నిలబడి 90 శాతం స్థానాలను తిరిగి నిలబెట్టుకోగలిగినట్టు చెప్పుకుంటున్నారు. దీంతో పార్టీ అధినేతకు గ్రౌండ్ రియాలిటీ ఏంటనేది పక్కా క్లారిటీ వచ్చేసిందట. ఆవిర్బావం నుంచి కూడా రాజకీయాలతో సంభందం లేకపోయినా చాలా మందికి అవకాశం ఇచ్చారు జగన్. పార్టీలో నెంబర్ టూ అని చెప్పుకునే స్దాయి నేతల నుంచి ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వంలో కీలక పదవులతో పాటు అనేక అవకాశాలు ఇచ్చారు..
అయితే అధికారం కోల్పోయాక ఆయనపైనే అభాండాలు వేసి పార్టీని వీడి వెళ్లిపోయిన వారు కొందరైతే.. సైలెంట్ గా జారుకున్న వారు మరికొందరు.. కేసుల భయంతో కొందరు.. తమ రాజకీయ అవసరాల కోసం ఇంకొందరు ఎవరి దారి వారు చూసుకున్నారు. కొద్ది మంది అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. కానీ అంతిమంగా పార్టీ కోసం కార్యకర్తలే నిలబడ్డారని ఇప్పుడు జగన్‌కు ఫుల్ క్లారిటీ వచ్చేసిందట. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలోని త్రిపురాంతకం, పుల్లలచెరువు ఎంపీపీ, ఉపాధ్యక్ష పదవు విషయంలో పెద్ద నాయకులతో సంబంధం లేకుండా మండ ల నేతలే పక్కా వ్యూహరచన, పార్టీకి కట్టుబడి ఉండాలన్న డెడికేషన్‌తో స్థానాలను తిరిగి నిలబెట్టుకున్నారు. 90 శాతం స్థానాల్ని తిరిగి నిలబెట్టుకోగలగడంపై పార్టీ అధినేత జగన్ కూడా స్పందించారు.. ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నా ధైర్యంగా పోరాడారని ఎక్స్ లోమెసేజ్ పెట్టారాయన. ఈ విజయం పార్టీకి కొత్త ఉత్సాహాన్నిచ్చిందని, భవిష్యత్తులోనూ ప్రజాసేవే తమ ధ్యేయమని చెప్పిన జగన్.. ఇదంతా అంకితభావంతో పని చేసిన నేతల విజయమని అన్నారు. పార్టీకి కీలక సమయంలో క్యాడర్ ఇలా యాక్టివేట్ కావటం అంత ఆషామాషీ విషయం కాదని.. వైసీపీ విషయంలో నేతలు.. కార్యకర్తలు నిలబడటం మంచి కంబ్యాక్ ఇచ్చిందని అంటున్నారు విశ్లేషకులు. చెయ్యి ఇచ్చి వెళ్లిపోయిన ఆ నేతల కంటే కీలక సమయంలో తనను అక్కున చేర్చుకున్న నేతలు, కార్యకర్తలే గొప్ప అన్న ఫీలింగ్ పార్టీ అధ్యక్షుడికి వచ్చిందని చెప్పుకుంటున్నారు. ఈ ఊపుతో వైసీపీ భవిష్యత్ వ్యూహం ఏ విధంగా ఉండబోతోందో చూడాలి .