కేసుల పరంపరలో ఇప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఆ మాజీ మంత్రి నంబర్ వచ్చిందా? మినిస్టర్‌గా నాడు ఆయన తీసుకున్న నిర్ణయాలన్నిటినీ కూటమి సర్కార్ జల్లెడ పడుతోందా? కొన్ని విషయాల్లో వెదుకుతున్న తీగలు దొరికాయా?అసలు పక్కా ఆధారాల కోసమే ఇన్నాళ్ళు ఆయన మీద కేసు పెట్టకుండా ఆగారా? ఎవరా మాజీ మంత్రి? ఏ విషయంలో ఆయన బుక్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? వెలంపల్లి శ్రీనివాస్…వైసీపీ హయాంలో మూడేళ్ళపాటు మంత్రిగా పనిచేశారు. ఆ టైంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు, కొందరికి ఇచ్చిన వెసులుబాట్ల కూపీ లాగుతోందట ప్రభుత్వం. దీంతో ఉమ్మడి కృష్టా జిల్లా నుంచి తదుపరి సారేనా అన్న చర్చ జరుగుతోంది రాజకీయవర్గాల్లో. ప్రజారాజ్యం తరపున తొలిసారి 2009లో ఎమ్మెల్యేగా గెలిచారు వెలంపల్లి. 2014లో బీజేపీ టికెట్ మీద టీడీపీ పొత్తుతో పోటీ చేసినా ఓడిపోయారాయన. తర్వాత వైసీపీలోకి షిఫ్ట్ అయిపోయి…2019లో ఆ పార్టీ తరపున గెలిచారు. అదే ఊపులో తొలిసారి క్యాబినెట్ బెర్త్ కూడా దక్కింది. కుల సమీకరణాల కారణంగా జగన్ తొలి కేబినెట్‌లో దేవాదాయ శాఖ మంత్రిగా అవకాశం దక్కింది వెలంపల్లికి. ఆయన మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక ఏపీలో అనేక చోట్ల ఆలయాలపై దాడులు, రథం దగ్ధం, విగ్రహాల ధ్వంసం లాంటి ఘటనలపై అప్పట్లో పెద్ద రచ్చే జరిగింది. అదంతా వదిలేసి…. అప్పట్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మీద గట్టిగానే నోరు పారేసుకున్నారన్న కోపం రెండు పార్టీల కేడర్‌లో ఉంది. ఆ క్రమంలోనే… మొదటిసారి ప్రజారాజ్యం నుంచి పోటీ చేసినప్పుడు తనకు ఓటు వేయాలని పవన్‌తో చెప్పించుకున్న వీడియోలను బయటకు తీసి మరీ ట్రోలింగ్ చేశారు జనసైనికులు. ఆయన మంత్రి కాగానే గతాన్ని మర్చిపోయి ముందూ వెనకా ఆలోచించకుండా బాబు, పవన్‌ని ఎంత మాట పడితే అంత మాట అన్నారన్నది రెండు పార్టీల కేడర్ వెర్షన్. సీన్ కట్ చేస్తే…… ఇప్పుడు వెలంపల్లి మాజీ మంత్రే కాదు, మాజీ ఎమ్మెల్యే కూడా. వైసీపీ హయాంలో జగన్ క్యాబినెట్ లో కొడాలి నాని, పేర్ని నాని, జోగి రమేష్, వెలంపల్లి శ్రీనివాస్ ఐదేళ్ళలో వేర్వేరు సమయాల్లో మంత్రులుగా పనిచేశారు. వీరిలో కొడాలి నాని, పేర్ని నాని, జోగి రమేష్ లపై కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసులు పెట్టడం, వాళ్ళు కోర్టులకు వెళ్ళడం జరిగిపోయాయి.
కోర్ట్ ఆదేశాలను బట్టి వాళ్ళ మీద తదుపరి చర్యలు ఉంటాయి. కానీ…మాజీ మంత్రుల్లో వెలంపల్లి శ్రీనివాస్ ఒక్కరి మీద మాత్రమే ఇంకా ఏ కేసు బుక్ అవలేదు. అందుకు కారణాలు కూడా బలంగా ఉన్నాయన్న చర్చ నడుస్తోంది. 2014లో బీజేపీ టికెట్ మీద పోటీ చేసినప్పుడు ఉన్న పరిచయాలతో…. కూటమిలోని కీలక నేతలతో వెలంపల్లి టచ్‌లో ఉన్నారని, అందుకే ఆయన మీద ఏ చర్యలు లేవన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఈ ఏడాది మొదట్లో వెలంపల్లి కూటమిలోని ఏదో ఒక పార్టీలో చేరతారని, ఆ పార్టీ నేతలతో టచ్ లో ఉన్నారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే అదంతా అవాస్తమమని టీడీపీ తరపున ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డూండీ రాకేష్ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పటం అప్పట్లో రాజకీయంగా చర్చనీయాంశం అయింది. మాజీ మంత్రిని కూటమిలో ఏ పార్టీ చేర్చుకోదని కూడా ఆయన స్టేట్ మెంట్ ఇవ్వటంతో మరింత చర్చ జరిగింది. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా వెలంపల్లి శ్రీనివాస్ మంత్రిగా పనిచేసినప్పుడు తీసుకున్న నిర్ణయాలపై సమీక్ష జరిపి చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్ళాయట. దాంతో దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జారీ చేసిన నో అబ్జక్షన్ సర్టిఫికెట్లు, విజయవాడ ఇంద్రకీలాద్రి మీద పనుల కాంట్రాక్టులు, నెయ్యి అగ్రిమెంట్లు, వెలంపల్లి ట్రస్టు పేరుతో నిర్వహించిన కార్యకలాపాలన్నిటి గురించి ప్రభుత్వం ఆరా తీస్తోందట. విజిలెన్స్ విభాగం ఆల్రెడీ అవకతవకల్ని గుర్తించే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. వీటితోపాటు ఇతర నిర్ణాలను కూడా పూర్తి స్థాయిలో సమీక్షించి అక్రమాలను వెలికితీయాలన్న నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. వాటి ఆధారంగా రాబోయే రోజుల్లో వెలంపల్లిపై కేసులు బుక్ అవుతాయన్నది ఇప్పుడు కృష్ణా పొలిటికల్ సర్కిల్స్‌లో జరుగుతున్న చర్చ. కేసు పెట్టకుండా ఇన్ని రోజులు ఆగడానికి ప్రధాన కారణం పూర్తి స్థాయిలో అవకతవకల్ని గుర్తించటం కోసమేనని చెప్పుకుంటున్నారు. దీంతో వెలంపల్లి నంబర్ కూడా త్వరలోనే వచ్చేస్తుందని సెటైరికల్‌గా మాట్లాడుకుంటున్నాయి రాజకీయ వర్గాలు.