తెలంగాణ కాంగ్రెస్ విషయంలో ఏఐసీసీ పెద్దలకు క్లారిటీ లేకుండా పోయిందా? తొమ్మిది నెలల నుంచి పోస్ట్‌ల భర్తీలో ఎందుకు కన్ఫ్యూజ్ అవుతోంది? అరకొర కమిటీతో ఇంకెన్నాళ్ళు బండి లాగిస్తారు? అత్యంత కీలకమైన పదవుల భర్తీకి ఇంకెన్నేళ్ళు పడుతుంది? పార్టీ పెద్దల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదా? లెట్స్ వాచ్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా….మహేష్ గౌడ్‌ను నియమించిన ఏఐసీసీ ఆయనకి టీంని సమకూర్చడానికి తొమ్మిది నెలలు పట్టింది. అయినాసరే… ఇప్పటికీ పూర్తి స్థాయిలో పీసీసీ కమిటీ నియామకం జరగలేదు. కేవలం ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను మాత్రమే నియమించి చేతులు దులుపుకుంది పార్టీ అధిష్టానం. ఇంకా సీనియర్ వైస్ ప్రెసిడెంట్స్, వర్కింగ్ ప్రెసిడెంట్స్, కార్యదర్శుల్ని నియమించాల్సి ఉంది. ప్రచార కమిటీ చైర్మన్‌ని కూడా నియమిస్తారని చెప్పుకున్నా… అదికూడా పెండింగ్‌లోనే ఉంది. ఈ పోస్ట్‌లన్నిటినీ ఎప్పుడు భర్తీ చేస్తారో కూడా ఇప్పటికీ క్లారిటీ లేదు. అటు అతి ముఖ్యమైన వర్కింగ్ ప్రెసిడెంట్స్ ఎంపిక కూడా పేచీలతో ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది. పార్టీ నాయకత్వానికి, సీనియర్ లీడర్స్‌కు మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో….వర్కింగ్ ప్రెసిడెంట్స్ నియామకం కొలిక్కి రావడం లేదట.
పార్టీ రాష్ట్ర నాయకత్వం సూచించిన ఓ పేరును ఆమోదించేందుకు ఇన్ఛార్జ్… ససేమిరా అంటున్నట్టు సమాచారం. అటు పార్టీ వర్కింగ్ ప్రెసిడింగ్ పోస్టుల్లో కూడా సామాజిక న్యాయం కోసం ప్రయత్నిస్తోందట అధిష్టానం. ఈ క్రమంలో ఎస్టీల నుంచి ఎంపీ బలరాం నాయక్, మరోనేత బెల్లయ్య నాయక్ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. మాదిగ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ పేర్లు పరిశీలనలో ఉన్నాయట. ఇక రెడ్ల నుంచి రోహిణ్ రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్టు సమాచారం. ఇప్పుడు పేచీ అంతా మైనార్టీ విభాగం నుంచి ఎవరిని తీసుకోవాలన్న దగ్గరేనట. అట్నుంచి ఫయీం, ఫిరోజ్ ఖాన్‌తో పాటు మరో ఇద్దరి పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుల్ని వీలైనంత త్వరగా భర్తీ చేసి ప్రజల్లోకి వెళితేనే… పార్టీకైనా, ప్రభుత్వానికైనా ఉపయోగమని, ఇక ఎంత ఆలస్యం అయితే… అంత నష్టం జరిగినట్టేనని అంటున్నాయి తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు.