Off The Record: తెలంగాణ బీజేపీలో సమన్యాయం జరగడం లేదా? సూపర్ పవర్స్, రెగ్యులర్ పవర్స్ అంటూ వేర్వేరుగా నిర్ణయాలు జరుగుతున్నాయా? రాష్ట్రం మొత్తం జిల్లాల అధ్యక్షుల నియామకాలు పూర్తయినా ఆ రెండు జిల్లాల్లో మాత్రం ఎందుకు పెండింగ్‌లో పడ్డాయి? అక్కడ అడ్డుపడుతున్న బలమైన శక్తులేవి? ఆ వ్యవహారం పార్టీలో అసంతృప్తికి ఆజ్యం పోస్తోందా?.. తెలంగాణ బీజేపీకి సంస్థాగతంగా 38 జిల్లాలు ఉన్నాయి. ఇందులో 36 జిల్లాలకు అధ్యక్షులను నియమించింది పార్టీ నాయకత్వం. అష్ట కష్టాలు పడి.. దశలవారీగా ప్రకటించినా.. మొత్తానికి సోమవారం నాడు 8జిల్లాల సారధుల ప్రకటనతో ఆ 36 చోట్ల సుఖ ప్రసవం అయినట్టే. కానీ.. ఓ రెండు జిల్లాలు మాత్రం అస్సలు కొరకరాని కొయ్యలుగా మారిపోయాయట. అదీ… పార్టీ ముఖ్య నాయకుల ప్రాతినిధ్యం ఉన్నవి కావడంతో.. ఉత్కంఠ పెరుగుతోంది పార్టీ వర్గాల్లో. స్థానికంగా ఉన్న పరిస్థితులు, నియోజకవర్గ నాయకులు, బడా లీడర్స్ మధ్య భిన్నాభిప్రాయాలు ఉండడంతో జిల్లాల అధ్యక్షుల నియామకం ఆలస్యం అవుతూ వస్తోంది. అందుకే.. టైం తీసుకుని, ఏకాభిప్రాయం తీసుకొచ్చి… వన్ బై వన్ సమస్యల్ని పరిష్కరించుకుంటూ వస్తున్నారు బీజేపీ ఎన్నికల అధికారులు.
Read Also: Betting Apps Case: ఇన్‌స్టాగ్రామ్‌లో పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఎమోషనల్ పోస్ట్.. బోరున విలపిస్తూ..
ఇక, ఫిబ్రవరి మొదటి వారంలో ప్రక్రియ మొదలుకాగా.. ఇంకా రెండు జిల్లాలు మిగిలే ఉన్నాయి. ఈ రెండూ పార్టీ బిగ్ లీడర్స్ జిల్లాలే. అందులో ఒకటి బండి సంజయ్ ఇలాకా అయిన కరీంనగర్ కాగా.. మరొకటి ఈటల రాజేందర్ ఎంపీ గా ఉన్న మేడ్చల్- మల్కాజ్ గిరి అర్బన్ జిల్లా. దీంతో అన్నీ అయిపోయి ఆ రెండు మాత్రం ఎందుకు మింగుడు పడటం లేదన్న చర్చ జరుగుతోంది తెలంగాణ కాషాయ వర్గాల్లో. అందరికంటే ముందే ముగిసిపోవాల్సిన చోట్ల ఇప్పటికీ పెండింగ్‌లో ఉంటడం ఏంటో అర్ధం కావడం లేదన్నది పార్టీ నేతల మాట. కరీంనగర్‌లో బండి సంజయ్ చెప్పిన పేరును పార్టీ ఒప్పుకోవడం లేదా? లేక పార్టీ సెలక్ట్ చేసిన పేరును సంజయ్ అంగీకరించడం లేదా అన్న చర్చ జరుగుతోంది పార్టీలో. ఈ విషయంలో క్లారిటీ కోసం ప్రయత్నిస్తున్నా.. ఏం అంతుచిక్కడం లేదట పార్టీ నేతలకు. ఇక మేడ్చల్-మల్కాజ్‌గిరిలో ఈటల రాజేందర్ ఒకరి పేరు చెబుతుంటే.. ఆ నియోజక వర్గంలో ఉన్న ఇతర ముఖ్య నాయకులు వేరే పేర్లు చెబుతున్నారట.
దీంతో ఒక క్లారిటీకి రాలేక పార్టీ పెద్దలు ప్రస్తుతానికి పెండింగ్‌లో పెట్టినట్టు తెలిసింది. ఎవరూ పట్టు వీడక పోవడంతో పీటముడి గట్టిగానే బిగుసుకుందట.
Read Also: Off The Record: జిల్లాలోని మూడు సెగ్మెంట్స్ మీద వాస్తు ఎఫెక్ట్ పడిందా?
అయితే, ఈ వైఖరి పార్టీలో అసంతృప్తుల్ని కూడా పెంచుతోందంటున్నారు. ఆ రెండు జిల్లాల వ్యవహారశైలిని చూస్తున్న రాజాసింగ్ లాంటి వాళ్ళు.. ఓపెనైపోతున్నట్టు సమాచారం. వాళ్ళిద్దరికో న్యాయం, మాకో న్యాయమా అని అడుగుతున్నారట. మా జిల్లాల్లోనేమో.. మేం వద్దన్న వారిని తెచ్చి నెత్తిన రుద్దారు. ఆ పెద్దల జిల్లాల్లో మాత్రం వాళ్ళ ఇష్టానికి వదిలేశారంటూ నిష్టూరాలాడుతున్నట్టు సమాచారం. కొన్ని జిల్లాల్లో నాయకులు తమ పంతం నెగ్గించుకున్నారు… మరికొన్ని జిల్లాల్లో ఒకరిని ఫైనల్ చేసి చివరికి ఇంకొకరిని నియమించారు…ఈ పక్షపాత వైఖరి ఏంటని అడుగుతున్నారట. ఇలా… మొత్తంగా రకరకాల కోణాల్లో పార్టీ సంస్థాగత ఎన్నికలకు సంబంధించి తెలంగాణ బీజేపీలో లొల్లి గట్టిగానే నడుస్తోందట. పార్టీ రాష్ట్ర నాయకత్వం దీన్ని ఎలా సెట్ చేస్తుందో చూడాలి మరి.