తెలుగుదేశం ఎమ్మెల్యేలు గాడి తప్పుతున్నారా? పార్టీ డీఎన్‌ఏలోనే ఉన్న క్రమశిక్షణ మెల్లిగా మాయమవుతోందా? సీఎం చంద్రబాబు హెచ్చరికల్ని సైతం కొందరు ఎమ్మెల్యేలు లైట్ తీసుకుంటున్నారా? పదే పదే చేస్తున్న హెచ్చరికల్ని కూడా ఎందుకు పట్టించుకోవడం లేదు కొందరు? ఎమ్మెల్యేల మీద బాబుకు గ్రిప్ తగ్గుతోందన్న ప్రచారంలో నిజమెంత? ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పట్టుమని పది నెలలు. పరిపాలనా పరంగా ఇది చాలా చిన్న సమయం. కానీ… ఈ టైంలోనే… కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు గాడి తప్పుతున్నారన్న వాదన బలపడుతోంది. జాగ్రత్తగా ఉండండి… తేడా వస్తే మామూలుగా ఉండదని సీఎం చంద్రబాబు డైరెక్ట్‌గా వార్నింగ్ ఇస్తున్నా… కొందరి చెవికెక్కడం లేదని, వాళ్ల వైఖరి మారడం లేదని చెప్పుకుంటున్నారు. మెల్లిగా తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టుగా కొందరి వైఖరి మారుతోందని టీడీపీ వర్గాలే మాట్లాడుకుంటున్న పరిస్థితి. చివరకు అదంతా… ఎలా మారిపోతోందంటే….. కొంతమంది ఎమ్మెల్యేల మీద అసలు చంద్రబాబుకే గ్రిప్ పోతోందని చెప్పుకునేంత. పార్టీ అధ్యక్షుడి పట్టు జారుతోందా అన్న డౌట్ వస్తోందట టీడీపీ నాయకులు కొందరికి. ఈ పది నెలల్లో కొంతమంది ఎమ్మెల్యేల తీరు ఇటు పార్టీని, అటు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిందన్న అభిప్రాయం బలపడుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే… ఎమ్మెల్యే ఆదిమూలం ఒక మహిళతో అత్యంత సన్నిహితంగా ఉన్న వీడియోస్ బయటికి వచ్చి నానా రచ్చ అయింది. తర్వాత తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి వరుస వివాదాలు. ఇక చింతమనేని ప్రభాకర్, ఎక్సైజ్ ఉద్యోగుల విషయంలో నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు వైఖరి, జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదాలు, విజయవాడకు చెందిన ఓఎమ్మెల్యే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడే… అధికారుల్ని బెదిరింపు ధోరణితో మాట్లాడ్డం… ఇలా ఒకటి కాదు, రెండు కాదు… చాలా వ్యవహారాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాయి. అలాంటివి వెలుగు చూసినప్పుడల్లా… పార్టీ అధిష్టానం నుంచి ఏదో ఒక వార్నింగ్ ఇవ్వడం తప్ప చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇది చూస్తున్న వాళ్ళంతా…. నేను లేస్తే మనిషిని కాదన్నట్టుగా ఉంది టీడీపీ అధిష్టానం తీరు…. ఒకరిద్దరి మీద గట్టి చర్యలు తీసుకుంటేనే కదా… మిగతా వాళ్ళు సెట్ అయ్యేది అని మాట్లాడుకుంటున్నారట. అదిపోను… అసలు పార్టీ అధ్యక్షుడిగా… ఎమ్మెల్యేల మీద చంద్రబాబుకు పట్టు ఉందా లేదా అన్న చర్చ సైతం మొదలైందట. మామూలుగా అయితే…క్రమశిక్షణ విషయంలో చంద్రబాబు ఎప్పుడూ గట్టిగా ఉంటారు.
కానీ…ఈ సారి ఆయన వ్యవహార శైలి భిన్నంగా ఉందని కేడర్‌లో చర్చ జరుగుతోందట. కూటమి ప్రభుత్వంలో మూడు పార్టీలు ఉన్నాయనో.. మరి ఏ ఇతర కారణాలోగానీ… సీఎం చంద్రబాబు వైఖరి గతానికి భిన్నంగా, పూర్తి మెతగ్గా ఉంటోందని, అదే కొందరు ఎమ్మెల్యేలకు అడ్వాంటేజ్ అవుతోందని గుసగుసలాడుకుంటున్నారట పార్టీ లీడర్స్. అటు సీఎం సైతం కొందరు ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని బాహాటంగానే చెప్తున్నారు. ఆయన చెప్పడమైతే చెబుతున్నారుగానీ… సదరు శాసనసభ్యుల్లో వీసమంత మార్పు కూడా రావడం లేదని, జరిగేవన్నీ యధేచ్ఛగా జరుగుచూనే ఉన్నాయని మాట్లాడుకుంటోందట కేడర్. అటు కొందరు..మంత్రుల విషయంలో కూడా ఇదే రకమైన చర్చ ఉందట. మంత్రుల జిల్లా పర్యటనలు కావచ్చు, లేదా వైసిపికి కౌంటర్స్ ఇచ్చే విషయం కావచ్చు…. ఏ విషయంలోనూ…పార్టీలైన్‌ను సీఎం మాటలను పట్టించుకున్నట్టు కనిపించడం లేదని అంటున్నారు. ఎంత చెప్పిన అసలు వాళ్ళు వినడం లేదని అంటున్నారు. దీంతో… బాబు ఎందుకు పట్టు సడలిస్తున్నారన్న డౌట్స్ పెరుగుతున్నాయి రాజకీయవర్గాల్లో. కొన్ని జిల్లాల్లో ఎమ్మెల్యేలు ఇసుక, లిక్కర్, రియల్ ఎస్టేట్ ఇలా…రకరకాల వ్యవహారాల్లో వివాదాస్పదం అవుతున్నారు. ఇది గ్రహించిన సీఎం చంద్రబాబు చాలా సందర్భాల్లో హెచ్చరించారు. కానీ పరిస్థితిలో మాత్రం మార్పు లేదు. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే… కనీసం కార్యకర్తలకు టైం ఇవ్వడం లేదట. నామినేటెడ్ పోస్టుల కోసం నాలుగు పేర్లు పంపమన్నా…పంపడం లేదని సీఎం డైరెక్ట్‌గానే అన్నారు. ఇలా…. చాలా విషయాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల విషయాల్లో ఫిర్యాదులు, అసంతృప్తులు ఉన్నాయి. తొలి ఏడాదిలోనే పరిస్థితి ఇలా ఉంటే… ఇక రాబోయే రోజుల్లో ఇంకెలా మారుతుందోనన్న చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. ఇలా వివాదాస్పదంగా ఉన్న ఎమ్మెల్యేల విషయంలో ఫోకస్ పెట్టాలని, లేదంటే… జనంలోకి నెగెటివ్ సంకేతాలు వెళ్ళడంతో పాటు చంద్రబాబుకు పార్టీ మీద పట్టు తగ్గిందన్న అభిప్రాయం బలపడితే… నానా రకాల ఇబ్బందులు పెరుగుతాయని అంటున్నారు పరిశీలకులు.