తెలుగుదేశం పార్టీలో ఆ “ఇద్దరూ- ఇద్దరే’. ఒకరు మంత్రి, మరొకరు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు. ఇన్నాళ్ళు గట్టు పంచాయితీ కూడా లేని వాళ్ళిద్దరి మధ్య ఇప్పుడు ఏకంగా ఇసుక తుఫానే మొదలైందట. ఇంకా కామెడీ ఏంటంటే… వాళ్ళిద్దరూ గొడవ పడుతున్న దగ్గర అసలు ఇసుక రీచ్‌లే లేవు. మరి ఎందుకా వివాదం? ఎవరా ఇద్దరు నాయకులు? తివిరి ఇసుము నుండి తైలం తీయవచ్చంటాడు భర్తృహరి. కానీ… కాలం మారింది కదా…. ఫర్ ఎ ఛేంజ్…ఫ్రీ శాండ్‌ని పిండేసి భారీగా దండేసుకోవచ్చని అంటోందట విశాఖ సిండికేట్. యార్డులు తప్ప రీచ్ లు లేని విశాఖ తీరంలో ఇసుక మాఫియా ఆగడాలపై తీవ్ర చర్చే జరుగుతోంది. ఇందుకు గాజువాక నియోజకవర్గం కేంద్రం అవ్వడం పొలిటికల్ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి సొంత నియోజకవర్గం కావడంతో సెగలు ఇంకా గట్టిగానే తగులుతున్నాయట. ఇసుక తవ్వకాలలో పారదర్శకత కోసం రాష్ట్ర ప్రభుత్వం పకడ్భందీ వ్యవస్ధను రూపొందించింది. ఉచిత ఇసుక విధానానంలో రవాణా, లోడింగ్ చార్జీలు చెల్లించి రీచ్‌ల దగ్గర నుంచి నేరుగా తీసుకుని వెళ్ళే సౌకర్యం ఉంది. ఇందు కోసం కాంట్రాక్టర్స్ ఎంత మొత్తం వసూలు చేయాలో కూడా నిర్ధేశించింది. అదే సమయంలో జిల్లాల వారీగా స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసి…..పర్యవేక్షణ బాధ్యతలు జిల్లా యంత్రాంగానికి అప్పగించింది ప్రభుత్వం. తక్కువ పరిమాణంలో ఇసుక అవసరమైన వారు యార్డుల నుంచి తీసుకోవచ్చు. సరిగ్గా ఇక్కడ నుంచే అసలు కథ మొదలైందట. ఉమ్మడి విశాఖజిల్లాలో ఎక్కడా ఇసుక రీచ్ లు లేవు. ఐతే గోదావరి లేదంటే వంశధార, నాగావళి నదుల మీదే ఆధారపడాల్సి వుంటుంది. అటు విశాఖలో నిర్మాణ రంగం నెమ్మదిగా ఊపందుకుంటోంది. ఇందు కోసం వందల టన్నుల ఇసుక అవసరం అవుతోంది. ఇక్కడే అవసరాలను కాంట్రాక్టర్స్ క్యాష్ చేసుకుంటున్నారట. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా గాజువాక యార్డును చెబుతున్నారు. రవాణా ఖర్చులతో కలిపి గోదావరి ఇసుక టన్నుకు 1300 రూపాయలు ధర నిర్ణయించారు. ఫ్రీ శాండ్ పాలసీలోనూ ఈ రేటు పెట్టడం భారంగా మారిందని చెప్పుకుంటున్నారు. దీంతో శ్రీకాకుళం, రాజమండ్రి వంటి చోట నుంచి ప్రయివేట్ ఆపరేటర్ల ద్వారా ఉచిత ఇసుక తెప్పించుకోవడం మొదలు పెట్టారు వ్యాపారులు. అది టన్ను వెయ్యిలోపే దొరుకుతోందట. ఈ విధంగా రోజూ వందల సంఖ్యలో లారీలు విశాఖ వస్తున్నాయి. అటు ప్రభుత్వం ఏర్పాటు చేసిన యార్డులో ఇసుక నిల్వలు పేరుకుపోవడంతో కాంట్రాక్టర్స్ స్ధానిక ఎమ్మెల్యే పల్లాశ్రీనివాస్‌కు గోడు వెళ్ళబోసుకున్నారట. ఆ తర్వాత రెవెన్యూ, మైనింగ్, విజిలెన్స్ విభాగాలు మూకుమ్మడి దాడులు చేయడం, మూడు రోజుల వ్యవధిలో 20 ఇసుక లారీలను సీజ్ చేయడం వివాదాస్పదంగా మారింది.
ఓవర్ లోడింగ్ పేరుతో కేసులు నమోదు చేయడం దుమారం రేపింది. రాజకీయ ఒత్తిళ్ళతోనే అధికారులు ట్రాన్స్‌పోర్టర్స్‌ని వేధిస్తున్నారన్న ఆరోపణలు బయలుదేరాయి. కొద్దిరోజుల నుంచి ఈ పరిణామాలు రాజకీయ వేడి పుట్టిస్తుండగా….మరోవైపు అందుబాటు ధరలో ఇసుక దొరక్క నిర్మాణదారులు ఇబ్బంది పడుతున్నారట. దీంతో కొందరు లారీ ట్రాన్స్ పోర్టర్లు మంత్రి అచ్చెన్నాయుడి దగ్గర పంచాయితీ పెట్టినట్టు తెలిసింది. శ్రీకాకుళం జిల్లా నుంచి వస్తున్న ఇసుక లారీలను సీజ్ చేయడం, ఫైన్లు విధించడం వంటి అధికారుల చర్యలపై మంత్రి సీరియస్ అయినట్టు సమాచారం. ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమలు చేస్తున్నప్పుడు ఇలాంటి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఆ విషయం తెలిశాక కొందరు ట్రాన్స్ పోర్టర్స్ అధికారులకు రివర్స్ అవుతున్నారట. నిబంధనలకు విరుద్ధం కానప్పుడు మమ్మల్ని ఎందుకు ఇబ్బందిపెడుతున్నారని నిలదీయడంతో సమస్య జఠిలంగా మారిందని అంటున్నారు. తన సొంత నియోజకవర్గంలో ఇలా… ఇసుక దుమారం ముదరడంతో ఎమ్మెల్యే పల్లాశ్రీనివాస్ జాగ్రత్తపడినట్టు తెలిసింది. వివాదాన్ని పరిష్కరించేందుకు యార్డు నిర్వహకులను పిలిచి ధరలు తగ్గించాలని ఆదేశించారట. దీంతో రవాణాఖర్చులు, లోడింగ్ చార్జీలు కలిపి 800రూపాయలుగా నిర్ణయించినట్టు తెలిసింది. అంటే టన్నుకు 500 రూపాయలు తగ్గినట్టు లెక్క. మరి ఇంత కాలం అంత అదనంగా వసూలు చేస్తుంటే ఎవరూ ఎందుకు పట్టించుకోలేదని నిలదీస్తున్నారు నిర్మాణదారులు. అలాగని, ఇప్పుడు పెట్టిన రేటు కూడా ఏం తక్కువ కాదట. విశాఖలోనే కొన్ని చోట్ల టన్నుకు 650 రూపాయలు లోపే ఇస్తుండగా…గాజువాకలో మాత్రం రేట్ చార్ట్ భిన్నంగా వుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పైగా, ఇక్కడ కాంట్రాక్టర్స్ అస్తున్న బిల్లుల్లో ఎక్కడా ధర కనిపించకపోవడం మరో విచిత్రం. ఇంత జరుగుతున్నా… గాజువాకలో ప్రయివేట్ ఆపరేటర్లకు నో ఎంట్రీ బోర్డు తీసేయకపోవడం, ధరలు తగ్గించినందున అందరూ యార్డు నుంచే తీసుకోవాలని నిర్దేశించడం వెనర రీజనేంటో అంతుబట్టడం లేదంటున్నారు పరిశీలకులు.