ఆ రెండు ఉమ్మడి జిల్లాలే తెలంగాణ ఎమ్మెల్సీ అభ్యర్థుల తలరాతల్ని నిర్ణయించబోతున్నాయా? మొత్తం నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఎన్నికలు జరిగితే రెండు జిల్లాల గురించే ఎందుకు మాట్లాడుకుంటున్నారు? ఏవా జిల్లాలు? ఏంటి వాటికున్న ప్రత్యేకత? ఎమ్మెల్సీ ఎన్నికల యుద్ధం ముగిసింది. ఇక ఫలితమే మిగిలి ఉంది. సాధారణ ఎన్నికలను తలపించిన ఉత్తర తెలంగాణ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఫలితాలపై ఉత్కంఠ అంతకంతకూ పెరుగుతోంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 15 మంది బరిలో ఉండగా రికార్డు స్థాయిలో 91.9 శాతం పోలింగ్ నమోదైంది. పట్టభద్రుల సీటుకు 56మంది పోటీ చేయగా 70.42 శాతం ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తంగా పట్టభద్రులు 2లక్షల యాభై వేల మంది… టీచర్లు 24వేల ఆరు వందల మంది ఓటు వేశారు. పట్టభద్రుల స్థానానికి సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రైవేట్ విద్యా సంస్థల అధినేత ఆల్పోర్స్ నరేందర్‌రెడ్డి, బీజేపీ తరపున ఎవరూ ఊహించని విధంగా క్యాడర్‌కు పెద్దగా పరిచయం లేని చిన్నమైల్ అంజిరెడ్డి, బీఎస్పీ అభ్యర్థిగా ప్రసన్న హరికృష్ణ తలపడ్డారు. ఈ ముగ్గురి మధ్యనే పోటీ ప్రధానంగా జరిగిందని చెప్పుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ విషయానికొస్తే పీఆర్టీయూ వంగ మహేందర్‌రెడ్డికి అవకాశం ఇచ్చింది. లెప్ట్ టీచర్స్ యూనియన్‌ల తరపున టీపీటిఎఫ్ నేత అశోక్ కుమార్ బరిలోకి దిగారు… బీజేపీ అభ్యర్థిగా ప్రైవేట్ విద్యాసంస్థల అధినేత మల్క కొమురయ్య పోటీ చేశారు. పదిహేను మంది అభ్యర్దులు బరిలో ఉన్నప్పటికీ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో ఈ ముగ్గురి మధ్యే పోటీ ఉందని భావిస్తున్నారు. అయితే గతం కంటే భారీగా నమోదయిన పోలింగ్ ఎవరికి ప్లస్ అవుతుంది… ఎవరి కొంప ముంచుతుంది అనే లెక్కలు మాత్రం అభ్యర్థుల్ని కంగారు పెడుతున్నాయట.ఎన్నికలు నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో జరిగినప్పటికీ పోలింగ్ జరిగిన తీరు, పోలయిన ఓట్లను బట్టి చూస్తే రెండు జిల్లాలే గెలుపు ఓటములను నిర్ణయించే అవకాశం ఉందని అంటున్నారు. పట్టభద్రుల, టీచర్ స్థానాలకు సంబంధించి పోలయిన వాటిలో మెజారిటీ ఓట్లు ఉమ్మడి మెదక్, కరీంనగర్ జిల్లాల్లోనే నమోదవడం ఆసక్తి రేపుతోంది. పోలింగ్ ముగిశాక జరుగుతున్న చర్చలను పరిశీలిస్తే… టీచర్స్ స్థానంలో ఎవరు గెలవాలన్నా… పన్నెండున్నర వేల ఓట్లు తప్పనిసరి. బరిలో ఉన్న అభ్యర్థులు మహేందర్‌రెడ్డి, అశోక్‌కుమార్ మెదక్ జిల్లాకు చెందినవారు కాగా… మల్కకొమురయ్య స్వస్థలం కరీంనగర్.
దీంతో ఎవరికి వారు తమ సొంత జిల్లాల్లో కాస్త అనుకూల ఓటింగ్ జరుగుతుందని ఆశిస్తున్నారట. ఉమ్మడి మెదక్, కరీంనగర్ జిల్లాల్లో ట్రయాంగిల్ వార్ సాగినప్పటికీ నిజామాబాద్‌లో మాత్రం పీఆర్‌టీయూ, బీజేపీల మధ్యే పోటీ ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. అటు ఆదిలాబాద్‌లోనూ ట్రయాంగిల్ ఫైటే జరిగిందంటున్నారు. కానీ… ఆదిలాబాద్, నిజామాబాద్ సంగతి ఎలా ఉన్నా…. కరీంనగర్, మెదక్ జిల్లాలే అభ్యర్థి గెలుపు ఓటములను నిర్ణయిస్తాయన్నది ఎక్కువ మంది అభిప్రాయం. ఈ రెండు జిల్లాల్లోనే దాదాపు 60 శాతం పోలింగ్ నమోదైంది. దీంతో ఉపాధ్యాయులు ఎటువైపు మొగ్గారనే లెక్కల్లో బిజీ ఉన్నారట అభ్యర్థులు. ఇక పట్టభద్రుల విషయానికొస్తే ఉమ్మడి కరీంనగర్, మెదక్ జిల్లాల ఓటర్లే కీలకం కానున్నారు. మొత్తం పోలయిన ఓట్లలో మూడింట రెండు వంతులు ఈ రెండు జిల్లాల పరిధిలోనే ఉన్నాయి. మొత్తంగా చూస్తే.. కరీంనగర్ మెదక్ జిల్లాలు ముగ్గురు అభ్యర్థులకు కీలకం కానున్నాయి. ఉమ్మడి మెదక్… బీజేపీ అభ్యర్థికి సొంత జిల్లా కావడం, ఇటు కరీంనగర్‌లో బీజేపీ సంస్థాగతంగా బలంగా ఉండటం, బండి సంజయ్ చాలెంజ్‌గా తీసుకోవడంతో… తన గెలుపు నల్లేరు మీద నడకే అని భావిస్తున్నారట బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి. ఇక కాంగ్రెస్‌కి సంబంధించి చూసినట్టయితే ఇద్దరు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తమదైన శైలిలో పనిచేయడం, అభ్యర్థికి సొంత జిల్లా కావడం కరీంనగర్‌లో కలసివస్తుందని భావిస్తున్నారట అభ్యర్థి నరేందర్‌రెడ్డి. ఇక బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ విషయానికొస్తే… ఈ రెండు జిల్లాల పరిధిలో ఉన్న బీఆర్ఎస్ శ్రేణులు పూర్తి స్థాయిలో కాకపోయినప్పటికీ కొంతమేర సహకరించినట్టు చెప్పుకుంటున్నారు. హరికృష్ణది కూడా కరీంనగర్ జిల్లానే కావడం… దానికి బీసీ కార్డు తోడయితే ఆయన గణనీయమైన ఓట్లు సాధించే అవకాశాలున్నాయంటున్నారు. మరోవైపు ఆదిలాబాద్ నిజమాబాద్ జిల్లాల్లో కొన్ని చోట్ల బీజేపీ, బీఎస్పీ అభ్యర్థికి, మరికొన్ని చోట్ల కాంగ్రెస్ అభ్యర్థికి బీఎస్పీ అభ్యర్థికి ఫైట్ నడిచిందట. ఎంత ఫైట్ నడిచినా పోలయిన వాటిలో 85వేల ఓట్లు మాత్రమే ఆ రెండు జిల్లాల పరిధిలో ఉన్నాయి. దీంతో అందరి దృష్టి కరీంనగర్ మెదక్ జిల్లాపైనే ఉంది.. ఇక్కడ ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయి… అనేది గెలుపు ఓటములను నిర్ణయించవచ్చంటున్నారు. అభ్యర్థుల అంచనాలు.. విశ్లేషకుల లెక్కలు….. ఏమేరకు మ్యాచ్ అవుతాయి… ఆ రెండు జిల్లాల ఓటర్లు ఎవరి పక్షాన ఉన్నారు అనేది తేలాలంటే…వచ్చే మూడు దాకా ఆగాల్సిందే.