Off The Record: తెలంగాణ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కలుపు మొక్కలు పెరిగిపోతున్నాయా? సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా ఈ అంశం చర్చకు వచ్చిందా? హైదరాబాద్‌లో డ్రగ్స్ దందాకు, కొందరు పోలీస్ అధికారులకు లింక్ ఉందన్న ఆ ఎమ్మెల్యే ఆరోపణల్లో నిజమెంత? ఎవరా ఎమ్మెల్యే? ఆయన ఆరోపణల్లో నిజమెంత?
తెలంగాణలో మాదక ద్రవ్యాల నిరోధానికి తీసుకుంటున్న చర్యల గురించి గొప్పగా చెబుతోంది ప్రభుత్వం. కానీ… డ్రగ్స్ కట్టడిలో పోలీస్ శాఖ వైఫల్యం అంటూ… అసెంబ్లీ సాక్షిగా విపక్ష ఎమ్మెల్యే విమర్శించడం కలకలం రేపుతోంది. డ్రగ్స్ కేసుల్లో కొంత మంది పోలీస్ ఉన్నతాధికారులు నిందితులతో చేతులు కలుపుతున్నారని ఆరోపించారు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ. నిందితులతో కలిసి పోలీసులు దందా చేస్తున్నారనడానికి తన దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పారాయన. ఒక్క పాతబస్తీలో జరుగుతున్న ఘటనలే కాకుండా … రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వ్యవహారాలపై తాను మాట్లాడుతున్నానని అక్బరుద్దీన్ చట్టసభ సాక్షిగా అనడం సంచలనమైంది. ఇటీవల తెలంగాణ పోలీసులు కొందరు వరుస కేసుల్లో సస్పెండ్ అవుతున్నారు. కొందరైతే ఏకంగా డిస్మిస్ అవుతున్నారు. ఓ పోలీసు అధికారి మహిళా కానిస్టేబుల్ పై అత్యాచారం చేశాడు. మరో అధికారి అక్రమాస్తులు కూడబెట్టి సస్పెండ్ అయ్యారు. గెస్ట్ హౌస్‌లో రాసలీలలు, లంచం తీసుకుంటూ దొరికిపోవడాలు.. ఇలా చాలానే జరుగుతున్నాయన్న మాటలు వినిపిస్తున్నాయి. చట్టాన్ని కాపాడాల్సిన వారే ఉల్లంఘిస్తున్నారనే విమర్శలు పెరగడంతో… పోలీస్ నిర్వాకాలపై హోంశాఖ బాధ్యతలు కూడా చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సస్పెన్షన్స్ పర్వం కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యే కొడుకు ఎపిసోడ్‌లో ఏకంగా స్టేషన్ సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేసిన ఘటనను మరువక ముందే… అదే పంజాగుట్ట పోలీస్ సిబ్బంది తాజాగా పాస్‌పోర్టుల కేసులో నిందితులుగా పట్టుబడటం సంచలనమైంది.
అలాగే గతంలో పలు విద్యా సంస్థలు, సినిమా ప్రముఖులు, వ్యాపారులు, బడా బాబుల పిల్లలను డ్రగ్స్ కేసుల నుంచి తప్పించేందుకు కోట్ల రూపాయల లంచాలు తీసుకున్నట్లు పోలీస్, ఎక్సైజ్ శాఖ పై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అదే సమయంలో… నిత్యం డ్రగ్స్ నివారణకు తమ శాఖ చేస్తున్న కృషిని అభినందించకుండా విమర్శించడంపై పోలీస్, ఎక్సైజ్ శాఖ అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. తమకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను, వసతులను దృష్టిలో పెట్టుకుని ఉన్న కొద్ది మంది సిబ్బందితో మాదక ద్రవ్యాల నిరోధానికి కృషి చేస్తున్నట్టు చెబుతున్నారు. ఎవరో కొద్దిమంది చేసే తప్పులను మొత్తం శాఖకు ఆపాదించడం సరికాదని అభిప్రాయపడుతున్నట్టు తెలిసింది. ఖండాంతరాల నుంచి డ్రగ్స్ దిగుమతి అవుతున్నాయని, పక్క రాష్ట్రాల నుంచి గంజాయి సరఫరా అవుతోందని, ఒకప్పుడు బడాబాబులకే పరిమితం అయిన డ్రగ్స్ ఇప్పుడు పాఠశాల విద్యార్థులకు దాకా వెళ్ళిన క్రమంలో తమ మీద వత్తిడి కూడా తీవ్రంగానే ఉందన్నది పోలీస్ అధికారుల అభిప్రాయంగా తెలిసింది. ఈ క్రమంలో రాజకీయ నాయకులు తమను టార్గెట్ చేస్తే ఏం చేయగలమన్నది పోలీస్ ఆఫీసర్స్ ఫీలింగ్‌గా చెబుతున్నారు. ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా… డ్రగ్స్ దందాలో పోలీస్ సిబ్బంది ప్రమేయం ఉందన్న అక్బరుద్దీన్ వ్యాఖ్యల చుట్టూ కొత్త చర్చ మొదలైంది. అదీ ఆయన సభలో అనడాన్ని పోలీస్ శాఖ ఎంతవరకు సీరియస్‌గా తీసుకుంటుందో… డిపార్ట్‌మెంట్‌లో ఉన్న కలుపు మొక్కల్ని ఏరేస్తుందా అన్న చర్చ జరుగుతోంది.